- రాజకీయ ఆనవాళ్లు లేకుండా చేసాం
- విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసాం
- విద్యతో పాటు, నైతిక విలువలకు ప్రాధాన్యత
- అసలు మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి
- తల్లి తండ్రుల నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టాలి
- నైతిక విలువల సదస్సులో మంత్రి నారా లోకేశ్ పిలుపు
(విజయవాడ, జయజయహే)
బడిలో పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పిస్తే సమాజంలో ఆశిస్తున్న మార్పును సాధించగలుగుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైనా ఉందని స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నైతికవిలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి చాగంటి కోటేశ్వరరావుని కేబినెట్ ర్యాంకుతో నియమించారని వెల్లడించారు. తాను అనేకమంది వ్యక్తులను కలిసినపుడు అంతా కేబినెట్ ర్యాంకు హోదా కావాలని కోరుకునేవారని కానీ చాగంటికి కేబినెట్ ర్యాంకు ఇచ్చినా కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదని, కనీసం ప్రభుత్వ వాహనం ఉపయోగించలేదని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిద్వారా ఈ రోజు నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి మీ భవిష్యత్తు కోసం అందిస్తున్నామని మంత్రి అన్నారు.
కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా నాకు మా తల్లి భువనమ్మ ఈ నైతిక విలువలు నేర్పారని అన్నారు. చాగంటి లాంటి గొప్ప వ్యక్తులతో పుస్తకాలు రూపొందిస్తే సరిపోదని అసలు మార్పు మన ఇంటినుంచే మొదలు కావాలని అన్నారు. మహిళలను గౌరవించినపుడే సమాజం బాగుపడుతుందని, ఇంకా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో మహిళలను అవమానించే డైలాగులు, సన్నివేశాలు ఉండకూడదు అని సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించానని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠ్య పుస్తకాలు పరిశీలించానని అందులో ఇంటి పనులు చేస్తున్న ఫొటోలన్నీ మహిళలవే కనిపించాయని వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మార్పులు చేశామని మంత్రి లోకేశ్ తెెలిపారు. అలానే నేటి సమాజంలో గంజాయి వినియోగం పెరిగిపోతుందని దీనిని కట్టడి చేయడానికి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించామని తెలిపారు. దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ ప్రక్షాళన చేస్తున్నామని, అందులో ఇప్పటికే తొలి అడుగు వేశామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
పిల్లలకు అందించే బ్యాగులు, పుస్తకాలు, బెల్ట్‌లపై రాజకీయపరమైన ఆనవాళ్లు లేకుండా చేశామని మంత్రి తెలిపారు. వాటిపై ఎక్కడా మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫొటోలు లేవని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్స్ అందించామని అన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, అలానే ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించామని వివరించారు. తాము బాధ్యత గల ప్రభుత్వంగా పని చేస్తున్నామని ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నతస్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. మీ అందరిలో ఆ శక్తి ఉందని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి ప్రతిరూపాయి మీకోసం ఖర్చు పెడుతున్నారని, వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని విద్యార్థులతో మంత్రి లోకేశ్ అన్నారు.
