Wednesday, April 22, 2026
HomeNewsస్మార్ట్ ఫ్యామిలీ కార్డు..!జూన్ లోగా క్యూ ఆర్ కోడ్ తో కార్డు జారీ

స్మార్ట్ ఫ్యామిలీ కార్డు..!జూన్ లోగా క్యూ ఆర్ కోడ్ తో కార్డు జారీ

స్మార్ట్ ఫ్యామిలీ కార్డు..!

ప్రభుత్వ పథకాలకు అనుసంధానం

జూన్ లోగా క్యూ ఆర్ కోడ్ తో కార్డు జారీ

స్టాటిక్, డైనమిక్ డేటా ప్రమాణికం

సీఎం చంద్రబాబు ఆదేశాలు

( అమరావతి, జయజయహే)

రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్​మెంట్ సిస్టంను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్​మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని తెలిపారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలని చెప్పారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని సూచించారు.

కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా: వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించటంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్​డేట్ అయ్యేలా చూడాలని సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments