అర్సెలార్ మిట్టల్ నిప్పాన్ రాక గొప్ప ముందడుగు
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు దిక్సూచి
సీఎం చంద్రబాబు ఆకాంక్ష
మాట ఇచ్చాం, మార్పు తెచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నామని వెల్లడించారు. ‘ఉత్తరాంధ్ర ఇక నుంచి ఉక్కు ఆంధ్రా’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశామని గుర్తు చేశారు. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్‌పై భరోసాను తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్‌కు నూతన దిక్సూచి అవుతుందని సీఎం స్పష్టం చేశారు. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామని సీఎం చెప్పారు.
ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోందని గుర్తు చేశారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. వచ్చే 3 ఏళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయని తెలిపారు. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్‌కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ: కాగా సోమవారం అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎన్‌ఎంసీ) ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి, సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు.
