– మాజీ ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు
గుంటూరు (జయ జయహే) భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే పాలకులు నిజాయితీ పరులైతేనే రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందుతాయని శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం బ్రాడీపేట నందు రాజ్యాంగ చర్చా వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు నడిం పల్లి గురుదత్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
కె.ఎస్.లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగ నిర్మాణం – రాజ్యాంగ పీఠిక, పుస్తకాన్ని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి,భారత రాజ్యాంగం – ముఖ్యాంశాలు పుస్తకాన్ని నర్రా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కె.యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ నేడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని మార్చే విధంగా, ఫెడరిలిజాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఈ పెనుముప్పు నుండి కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థదే అని పేర్కొన్నారు. కేంద్రీకృత ధోరణి పెరుగుతుందని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారత సమాజాన్ని మతాలవారీగా, ప్రాంతాలవారీగా విభజించి పాలించడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు,జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ అధికార పార్టీలు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులుకు పాల్పడుతున్నాయని, బాధితులనే నిందితులుగా మార్చి జైళ్ళకు పంపే పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని వివరించారు. ఇండియన్ లాయర్స్ యూనియన్ కార్యదర్శి, హైకోర్టు సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న లౌకికవాదం, సామ్యవాద భావాలకు తిలోదకాలిస్తూ మత రాజ్యం గ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారతీయులందరూ ఐక్యంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకే పన్ను, ఓకే ఎన్నికలు, ఒకే మతం, ఒకే భాష, ఒకే రకమైన ఆచారాలు లాంటి ఏకపక్ష భావనలతో భిన్నత్వమైన భారతీయతను దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, సంయుక్త కార్యదర్శి టి. సేవ కుమార్, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, అవగాహన సంస్థ వ్యవస్థాపకులు కొండా శివరామిరెడ్డి, ప్రోగ్రెస్ ఫోరం కార్యదర్శి పి.వి.మల్లికార్జునరావు, బీసీ మహా జనసభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, ఎల్ ఎస్ భార్గవి,స్టూడెంట్స్ యూనియన్ ఫర్ నేషన్ ఆశిష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
