ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో అత్యధిక కేటాయింపులు చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు మంగళవారం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలన్నారు. చదువుకున్న పాఠశాలకు.. తల్లిదండ్రులకు.. పుట్టిన ఊరుకు.. మంచి పేరు తెచ్చేలా ఉన్నత స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులో నోబెల్ బహుమతి అందుకున్న మలాల్ చెప్పినట్టు విద్యార్థి – ఉపాధ్యాయుడు – పుస్తకం – కలానికి మాత్రమే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
*విద్యార్ధినులు గీసిన తన చిత్రాలను చూసి అచ్చెరువొందిన గంటా*
పాఠశాలకు వచ్చిన గంటా శ్రీనివాసరావు విద్యార్ధినులు గీసిన తన చిత్రాలతో స్వాగతం పలకడంతో అచ్చెరువొందారు. తాము ఎంతో అభిమానంగా భావించే గంటా కు వినూత్నంగా స్వాగతం పలకాలనే ఆలోచనతో ఆయన బొమ్మలు గీశామని విద్యార్ధినులు చెప్పారు. కార్యక్రమంలో
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జగదీష్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ పద్మావతి, భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పీవీ నరసింహం, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, కొప్పల రమేష్, గొలగాని నరేంద్ర, జీరు సత్యం, పాసి నరసింగరావు, పాండ్రంగి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు
