- లైన్ దాటితే సహించను
- పార్టీ క్రమశిక్షణ దాటరాదు
- చర్యలకు వెనుకాడేది లేదు
- చంద్రబాబు సీరియస్ వార్నింగ్
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరూ దాటినా సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ తిరువూరు విభేదాలకి కారణమైన ఇరువురు నేతలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావులతో తాను కూడా మాట్లాడుతానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
చర్యలు తప్పవు..
ఆ తర్వాత కూడా పరిస్థితి చక్కబడకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని ఇరువురు నేతలకి చెప్పాలని సూచించారు. ఇవాళ(శుక్రవారం) టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అధినేత చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో తిరువూరు విభేదాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తిరువూరు వివాదాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు సీఎం చంద్రబాబు.
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావులని పిలిపించి మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరువురు అభిప్రాయాలను ఓ లేఖ రూపంలో తనకు ఇవ్వాలని ఆదేశించారు. తాను లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడుతానని అధినేత స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ నెగెటివ్, ఫేక్ ప్రచారం చేస్తోందని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకువచ్చారు. ఈ విషయంపై నిజాలు ఏమిటో ప్రజలకు టీడీపీ శ్రేణులు వివరించాలని చెప్పారు. అవసరమైతే సోషల్ మీడియాలో ఈ విషయంలో అవగాహన ఉన్నవారిని తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, వచ్చే వారం తర్వాత నుంచి వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
అప్పుడే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీల నియామకం..
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదని సీఎంకు పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. అంత సమయం లేకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తయారు చేసి తనకు టెలికాన్ఫరెన్స్‌లో అందరిని కలపాలని ఆజ్ఞాపించారు. తన లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలను నియమిస్తామని చెప్పుకొచ్చారు. జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని తీసుకొని రావాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై తాను ఒక గంట సమయం కేటాయిస్తే చాలని చెప్పుకొచ్చారు. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఎమ్మెల్యేలు నవంబరు 2వ తేదీన మళ్లీ వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంటల నష్టం అంచనా సరిగా జరిగిందా..? ..లేదా..? అనే అంశంపై టీడీపీ నేతలు అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
