ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేయడం వైసిపి నాయకుల దౌర్భాగ్య రాజకీయాలేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) విమర్శించారు. దురదృష్టకర సంఘటనలు ఎక్కడైనా జరిగితే అలాంటివి జరగకూడదని కోరుకోవడం సహజమని, కానీ వైసిపి నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇటీవల దాడిలో గాయపడి యూనివర్శల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజయకుమార్‌ను ఎమ్మెల్యే వాసు పరామర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసీ ఇంటర్న్‌షిప్ చేస్తున్న నాగాంజలి ఆత్మహత్య ఘటనలో ఆమె కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పిన మేరకు పోస్టల్ కాలనీలోని జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కలిసి నాగాంజలి తండ్రికి భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.2 లక్షలు అందజేశామని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో వైసిపి నాయకులు జగన్‌మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి సాయం చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం ఉంటేనే సాయం చేస్తారా? లేకపోతే అవసరం లేదా అని ఎమ్మెల్యే వాసు నిలదీశారు.
విజయకుమార్‌పై అప్పారావు దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి అనేక దాడులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత కోసం అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేయించామని, తాజాగా జరిగిన దాడికి సంబంధించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. గత ప్రభుత్వంలా తప్పుచేసిన వారిని వెనకేసుకుని రావడం కూటమి ప్రభుత్వంలో ఉండదని స్పష్టం చేశారు.
అల్లరి మూకలపై రౌడీషీట్లు ఓపెన్ చేసి ఆదివారాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ప్రవర్తన మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. క్రికెట్ టీమ్ గెలిస్తే ర్యాలీలు చేయడానికి సమయం ఉందిగానీ దాడిలో గాయపడిన వారికి భరోసా ఇవ్వడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. దాడిలో గాయపడిన విజయకుమార్ చికిత్సకు అయ్యే మొత్తం మెడికల్ ఖర్చును భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున భరిస్తామని, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూడా సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు
ముందుగా వచ్చి పరామర్శించి సాయం అందించినందుకు ఎమ్మెల్యే వాసుకు బాధితుడి భార్య సుంకర అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని, దాడి చేసిన వ్యక్తి జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. చిన్న లైట్ విషయంలో జరిగిన గొడవతో తమపై దాడి చేశారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
వైసిపి దౌర్భాగ్య రాజకీయాలు మానాలి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
RELATED ARTICLES
