కొవ్వూరు పట్టణంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పట్టణంలోని కాటన్ బొమ్మ సమీపంలో, గోదావరి ఆర్చ్ బ్రిడ్జి వద్ద ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను తగులబెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. దీంతో కొవ్వూరు పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగను పీలుస్తూ ఆరోగ్య సమస్యలతో భయాందోళనలకు గురవుతున్నారు.
ఇప్పటికే సమీపంలోని జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరం కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అక్కడ కాలుష్యం తీవ్రంగా ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కొవ్వూరులో కూడా అదే పరిస్థితి నెలకొంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల నుంచి ప్రతిరోజూ క్వింటాళ్ల కొద్దీ పొడి, తడి చెత్తను సేకరిస్తున్నారు. అయితే ఈ చెత్తను నిర్వహించేందుకు సరైన డంపింగ్ యార్డు లేకపోవడంతో పట్టణంలోని కాటన్ బొమ్మ సమీపంలోని ప్రదేశంలోనే ఏళ్లుగా చెత్తను పోస్తున్నారు. కాలక్రమేణా అక్కడ పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి చెత్త గుట్టలా మారింది.
గతంలో ఈ చెత్తను కొంతమంది రీసైక్లింగ్ కోసం వేరు చేసి తీసుకెళ్లే వారు. ప్లాస్టిక్, ఇనుము వంటి పదార్థాలను వేరు చేసి రీసైక్లింగ్ చేయడంతో చెత్త పరిమాణం కొంత తగ్గేది. అయితే ఇటీవల కాలంలో ఈ రీసైక్లింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రోజురోజుకూ చెత్త భారీగా పేరుకుపోతోంది.
ఈ నేపథ్యంలో అక్కడ వేసిన చెత్తను తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సిన బదులు, కొంతమంది ఉదయం, సాయంత్రం వేళల్లో చెత్తను తగులబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్తను కాల్చడం వల్ల భారీగా దట్టమైన పొగ గాల్లో వ్యాపించి గాలివాటంతో కొవ్వూరు పట్టణం వైపు చేరుతోంది. దీంతో పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగను పీలుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
చెత్త దహనం వల్ల గాల్లో హానికర వాయువులు వ్యాపించి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రజలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు పట్టణానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గోష్పాద క్షేత్రం ప్రాంతానికి వేలాది మంది యాత్రికులు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో పట్టణ పరిసరాల్లో చెత్త దహనం వల్ల కాలుష్యం పెరిగితే భక్తులతో పాటు స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్త దహనాన్ని పూర్తిగా నిలిపివేసి, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కొవ్వూరు పట్టణం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
చెత్త దహనం… కొవ్వూరు ప్రజల ప్రాణాలతో చెలగాటం!
RELATED ARTICLES
