ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు చెనమల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న అంతర్జాతీయ విధానాలు ప్రపంచాన్ని ఒక తీవ్రమైన ఆర్థిక, రాజకీయ మరియు మానసిక అనిశ్చితి వైపు నెట్టినట్టు అనిపిస్తోంది. “అమెరికా ఫస్ట్” సిద్ధాంతంతో నియంత్రించిన నిర్ణయాలు ప్రపంచ మార్కెట్ల పతనానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై, ఎగుమతులు, దిగుమతులపై సుంకాలు పెంచడం, అనేక దేశాలతో వాణిజ్య వివాదాలు, సైనిక చర్యలతో ట్రంప్ పాలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ నిధులు మరియు పెట్టుబడిదారులు నష్టాలు చవి చూస్తున్నాయి— ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ ఆర్ధిక నిఘంటువు ప్రకారంగా ఎక్కువ వాణిజ్య సుంకాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి విషపూరిత శక్తి కావచ్చు అన్న హెచ్చరిక కూడా ఉంది.
*రాజకీయ సంక్షోభాలు*
ట్రంప్ పాలనలో రాజకీయ ఉత్కంఠలు మరింత తీవ్రం అయ్యాయి. ఆయన వెనిజుయేలాలో సైనిక చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ వర్గాలు నివేదించాయి, ఇందులో అధికార అధ్యక్షుడు మదురోను, అతని భార్యను బలవంతంగా అమెరికా తీసుకుపోయి, వెనిజుయేలా పై తన పూర్తి పట్టు నిలుపుకున్నారు, అలాగే ఆ దేశంపై వసూళ్ల నిర్వహణకు అమెరికా పూర్తి అధికారమా తీసుకుంది.
మరోవైపు గ్రీన్లాండ్పై ట్రంప్ ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, దాని ప్రాంతాధికారాన్ని డెన్మార్క్ నుండి అమెరికాకు బదిలీ చేయాలనే బరితెగింపుకు పూనుకున్నాడు. డెన్మార్క్ కు వత్తాసు పలుకుతూ చాలా యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికాతో కొన్ని వాణిజ్య ఒప్పందాలను నిలిపివేసి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్ అంతర్గత విషయాలలో తల దూర్చి, అక్కడి అధికార మార్పు జరగాలని, లేని పక్షంలో ఆ దేశంపై సైనిక దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. అంతటితో ఆగక, ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధించే నిర్ణయాలు కూడా ట్రంప్ తీసుకోవడం జరిగింది. ఇవి అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
ఒక స్వతంత్ర, గణతంత్ర దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలనే చట్టాన్ని కూడా, అమెరికా చట్ట సభల్లో తన మిత్రుల ద్వారా ప్రెవేశపెట్టడం వంటి నియంత దుశ్చర్యలకు పాలుపడుతున్నాడు ట్రంప్. ఇవి మాత్రమే కాదు, ట్రంప్ ఆవేశపూరిత దుశ్చర్యల వలన నాటో వంటి శక్తివంతమైన భద్రతా కూటముల్లో విభేదాలు ఏర్పడుతున్నాయి.
*ట్రంప్ నిర్యాలతో మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు*
డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న స్వార్ధపూరిత నిర్ణయాల వలన ప్రపంచ రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చుతున్నాయి. ఆయన ఏకపక్ష వైఖరి, బెదిరింపు దౌత్యం, భద్రతా ఒప్పందాలపై అనిశ్చితి యూరప్తో పాటు మధ్యప్రాచ్యం, ఈశాన్య ఆసియాలోనూ కొత్త కూటముల ఆలోచనలకు దారితీస్తోంది. దావోస్ వేదికగా యూరోపియన్ నేతల విమర్శలు ఈ మార్పులకు స్పష్టమైన సంకేతంగా నిలిచాయి.
యూరోప్ స్పందన:
ప్రపంచం నిబంధనలు లేని దిశగా సాగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ గ్రీన్లాండ్పై చేసిన హెచ్చరికలను సామ్రాజ్యవాద ఆలోచనల పునరుద్భవంగా అభివర్ణించారు. బెదిరింపులు, బలవంతపు రాజకీయాలకు ఈయూ లొంగకూడదని, గౌరవం, చట్టబద్ధత, స్థిరత్వమే ప్రపంచానికి అవసరమని ఆయన స్పష్టం చేశారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సెలా వాన్ డెర్ లేయన్ కూడా ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులకు యూరప్ ఐక్యంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిణామాలు స్వతంత్ర యూరప్ నిర్మాణానికి కీలక అవకాశంగా మారాయని వ్యాఖ్యానించారు.
బెల్జియం ప్రధాని బార్డ్ డి వెవర్ మాట్లాడుతూ, 27 సభ్య దేశాల ఐరోపా సమాఖ్య ఒక కీలక కూడలిలో ఉందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా మద్దతుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇస్లామిక్ నాటో:
ఇదిలా ఉండగా, ట్రంప్ విధానాల వల్ల ప్రపంచ భద్రతా నిర్మాణాల్లో ఏర్పడుతున్న ఖాళీని పూరించేందుకు మధ్యప్రాచ్యంలో కొత్త కూటముల ఆలోచనలు ఊపందుకుంటున్నాయి. ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అరబ్, ఇస్లామిక్ దేశాల నేతలు దోహాలో సమావేశమయ్యారు. నాటో తరహాలో అరబ్, ఇస్లామిక్ దేశాల ఉమ్మడి భద్రతా వ్యవస్థ అవసరమని ఇరాక్ ప్రధాని మొహమ్మద్ సుడానీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పటికే 34 దేశాలతో కూడిన ఇస్లామిక్ కూటమి ప్రతిపాదనను సౌదీ అరేబియా ముందుంచిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ‘ఇస్లామిక్ నాటో’ ఆలోచనకు బలం చేకూరుస్తున్నాయి.
మొత్తంగా, ట్రంప్ విధానాలు యూరప్ను మాత్రమే కాదు, మధ్యప్రాచ్యం మరియు ఈశాన్య ఆసియాను కూడా కొత్త భద్రతా, రాజకీయ సమీకరణాల వైపు నడిపిస్తున్నాయి. బెదిరింపుల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ కూటములు, స్వతంత్ర నిర్ణయాలు ముందుకు వస్తున్నాయి. ఇవి భవిష్యత్ ప్రపంచ శక్తి సమతౌల్యాన్ని మలుపుతిప్పే పరిణామాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.
*ఆర్థిక వ్యవస్థపై ప్రభావం*
ట్రంప్ పాలనలో అమలు చేసిన కఠిన దిగుమతి సుంకాలు, ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టుతున్నాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసులు ఇప్పటికే కరోనా అనంతర ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకోకముందే, కొత్త వాణిజ్య యుద్ధాల భయం వ్యాపార వర్గాల్లో అనిశ్చితిని పెంచింది. చైనా, యూరోప్, లాటిన్ అమెరికా దేశాలపై విధించిన అధిక సుంకాలు ముడిసరుకుల ధరలను పెంచి, తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీని ప్రభావం చివరకు వినియోగదారులపై ధరల పెరుగుదల రూపంలో పడుతోంది.
ట్రంప్ ఒప్పందాలు చేసుకునే విధానం చాలా సరళంగా కనిపించినా ప్రమాదకరం. ముందుగా ఎదుటి దేశం నుంచి భారీ రాయితీలు కోరుతాడు. అంగీకరించకపోతే సుంకాలతో బెదిరింపులు చేస్తాడు. చివరికి అవమానకరమైన, అసమానమైన ఒప్పందాలు చేస్తాడు. అయినా ఆ దేశ ఎగుమతులపై సుంకాలు కొనసాగుతూనే ఉంటాయి. వియత్నాం, తైవాన్, దక్షిణ కొరియా, యూరప్ యూనియన్ దేశాలు ఇప్పటికే ఈ ఉచ్చులో పడ్డాయి. ఇప్పుడు అదే ఉచ్చు జపాన్ కోసం సిద్ధం చేశాడు.
అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కేవలం దేశీయ ఆర్థిక విధానాలకే పరిమితం కాకుండా, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల పాత్రను కూడా బలహీనపరుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వాణిజ్య నిబంధనలను పక్కనపెట్టి శక్తి ప్రదర్శనపై ఆధారపడే విధానం ప్రపంచ ఆర్థిక క్రమాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ప్రతీకార చర్యలుగా యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచడం వలన వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది.
ఈ పరిస్థితులు అమెరికా స్టాక్ ఎక్స్చేంజీలపైనా ప్రభావం చూపుతున్నాయి. వాల్ స్ట్రీట్లో తీవ్ర ఊగిసలాటలు, పెట్టుబడిదారుల నమ్మకంలో పతనం కనిపిస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులు తగ్గడం, మార్కెట్లలో భయ వాతావరణం పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందన్న భయాలను బలపరుస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పర ఆధారితమైన ఈ కాలంలో, ఇలాంటి అస్థిర విధానాలు దీర్ఘకాలిక నష్టాలకు దారి తీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
*మనసిక అనిశ్చితి మరియు అంతర్జాతీయ నమ్మకం*
ట్రంప్ అనుసరిస్తున్న అనాలోచిత, భయానిక, నియంత పోకడలతో కూడిన విధానాలు మరియు ట్రంప్ ఎప్పుడు ఏ దేశంపై ఎటువంటి ఆంక్షలు వేస్తాడో, ఏ దేశంపై యుద్ధం ప్రకటిస్తాడో, అనే అనుమానాలు, అనిశ్చితలు ప్రపంచ మానసిక వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ భద్రతా ఒప్పందాల భవిష్యత్పై నెలకొన్న అస్థిరత, దేశాల మధ్య పెరుగుతున్న అనుమానాలు మరియు పరస్పర అవిశ్వాసం ప్రపంచ ప్రజల్లో భయభ్రాంతిని పెంచుతున్నాయి. శాంతి, స్థిరత్వానికి దారి చూపాల్సిన మహాశక్తి నాయకత్వం వివాదాస్పదంగా, భయానికక్నగా మారడంతో అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తోంది. దౌత్యానికి బదులుగా బెదిరింపులు, ఏకపక్ష నిర్ణయాలు ప్రాధాన్యం పొందడం వల్ల దేశాల మధ్య సహకారం బలహీనమై, ప్రపంచ స్థాయిలో మానసిక అస్థిరత మరింత లోతుగా వేళ్లూనుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ పాలనలో తీసుకుంటున్న ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు ప్రపంచాన్ని ఒక ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉత్కంఠలు, మానసిక భయాలు కలిగించే దిశలో నడిపిస్తున్నాయి. ప్రపంచ నాయకత్వం, సహకారం, స్థిరత — ఇవి బాధ్యతగా మలచి, ప్రపంచ సమస్యలకు సామూహిక దౌత్య పరిష్కారాలు కనగలిగితేనే మనం భవిష్యత్తు పట్ల ఆశపడగలము.
ఎవరికో ఎదో జరుగుతుంది మనకెందుకులే అనుకొనే పరిస్థితుల్లో నేడు ప్రపంచం లేదు. ఈ రోజు ఆ దేశం, రేపు మన దేశం కావొచ్చచు. కావున, ప్రపంచ దేశాల నేతలు త్వరగతిన మేల్కొని తగిన నివారణ చర్యలు చేపట్టాలి.
