Monday, June 1, 2026
HomeNewsతిరుమల లడ్డూ నెయ్యి వివాదం: సీఎం వ్యాఖ్యలు దైవద్రోహమే

తిరుమల లడ్డూ నెయ్యి వివాదం: సీఎం వ్యాఖ్యలు దైవద్రోహమే

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన సోమవారం ములాఖత్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, తిరుమల ప్రసాదం అంశాన్ని రాజకీయ వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని తీవ్రంగా మండిపడ్డారు.
అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కాలం నుంచే తనకు వ్యక్తిగత పరిచయం ఉందని పేర్కొన్న ఉండవల్లి, ఆ పరిచయంతోనే ములాఖత్‌కు వచ్చానన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కొత్త ఒరవడి మొదలు పెట్టారని విమర్శించారు. “తిట్టిన వాళ్లకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్లకి స్టేషన్ బెయిలు” అన్న పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంప్రదాయం ప్రజాస్వామ్యానికి మేలు చేయదన్నారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఉండవల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్ నివేదికలోని 20వ పేజీలో తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు జంతువుల కొవ్వు ఉందని, టాయిలెట్స్ కడిగే లిక్విడ్ వాడారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు సాధారణంగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడరని, కానీ తిరుమల ప్రసాదం విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.
తిరువతి ప్రసాదంపై ఈ తరహా వ్యాఖ్యలు దైవద్రోహంతో సమానమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కూడా ఇంత తీవ్రంగా మాట్లాడడం లేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు పునరాలోచించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోంజన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, సక్కా నగేష్, మానే దొరబాబు, కోడి కోట తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments