తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఒక ఇంటి వెనుక భాగంలో (బ్యాక్‌యార్డ్) పులి కదలికలను స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు గుమికూడటంతో భయపడ్డ పులి అక్కడి నుంచి పొలాల వైపు పరుగులు తీసింది. అనంతరం సుమారు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న గొడ్ల పాకలోకి దూరినట్లు అధికారులు గుర్తించారు.
పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన అటవీ శాఖ అధికారులు వెంటనే క్యాప్చర్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తూ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రజల భద్రత దృష్ట్యా పులి సంచరించిన ప్రాంతం చుట్టూ సుమారు ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, తలుపులు మూసి వేసుకుని బయటకు రావద్దని అధికారులు సూచించారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటివరకు పులి కేవలం జంతువులపై మాత్రమే దాడి చేసిందని, మనుషులపై ఎలాంటి దాడి జరగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు తెలిపారు. పులి స్వభావం అత్యంత సున్నితమైనదైనందున అనవసరమైన శబ్దాలు, అలజడులు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పులి కదలికలపై అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగుతోందని, అవసరమైన సమాచారాన్ని అధికారికంగా మాత్రమే వెల్లడిస్తామని, వదంతులను నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
రాయవరం కూర్మాపురంలో పులి సంచారం… అప్రమత్తమైన అధికారులు, కొనసాగుతున్న క్యాప్చర్ ఆపరేషన్
RELATED ARTICLES
