శ్రీకాకుళం జయ జయహే: ప్రతి మనిషి భవిష్యత్తుకు బాల్యంలోనే బాటలు పడతాయని ఇస్కఫ్ శ్రీకాకుళ జిల్లా శాఖ అధ్యక్షులు బి.వి.ఎస్.ఎన్.రాజు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం పట్టణం లోని పి.ఎస్.ఎన్. ఎం. పాఠశాలలో ఇస్కఫ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారి హక్కులు, సంక్షేమం, విద్య సంబంధించిన విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను ప్రతియేటా ఈ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవదత్త మాట్లాడుతూ మన దేశ మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి నాడు ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామన్నారు. బాలలంటే నెహ్రూకు చాలా ఇష్టంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇస్కఫ్ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువుల సూచనలు పాటించాలన్నారు. ఆసంఘం మరో గౌరవ అధ్యక్షులు ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇస్కఫ్ రాష్ట్ర సంఘం సభ్యులు ఎం.వి.మల్లేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. సంఘం జిల్లా సెక్రటరీ నాగభూషణరావు మాట్లాడుతూ పిల్లలు సమతుల ఆహారం తీసుకుని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరావు, పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
