Saturday, April 25, 2026
HomeNewsపేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) – మన ఇల్లు మన గౌరవం’ పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి, ఆకుల వెంకటలక్ష్మి అనే లబ్ధిదారురాలికి స్వయంగా ఇంటి తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వేదమంత్రాల మధ్య కొత్త ఇళ్లలోకి లబ్ధిదారులు ప్రవేశించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మంత్రి మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు 3,426 ఇళ్లు పూర్తి కాగా, నిడదవోలు నియోజకవర్గంలో 122 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే 691 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ప్రస్తుతం మరో 113 ఇళ్లను అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంటిలో కిచెన్, హాల్, బెడ్‌రూమ్ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల ప్రాథమిక సాయంతో పాటు బీసీలకు అదనంగా రూ.50 వేల రూపాయలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రూ.75 వేల రూపాయల అదనపు సహాయం అందిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు స్థిర నివాసం కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత ప్రభుత్వం నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను విస్మరించిందని విమర్శించిన మంత్రి, తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేసిందని తెలిపారు. పందలపర్రులో 67 ఇళ్లకు మంజూరు కాగా, ఇప్పటికే 52 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు.
టిడ్కో ఇళ్లపై ప్రత్యేక దృష్టి:
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన మంత్రి, మౌలిక సదుపాయాల లోపంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలించామని, త్వరలో ప్రత్యేక కార్యాచరణతో అన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు వేగవంతం:
నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూ.28 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమాల ద్వారా గ్రామీణ రహదారులు, డ్రైన్లు నిర్మించామని చెప్పారు. అలాగే కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాలు, పుంత రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన గోదావరి నీటిని అందించడమే లక్ష్యమని, అమరజీవి జలధార పథకం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల నీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments