Saturday, April 18, 2026
HomeUncategorizedఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ

ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ

  • ప్రభుత్వ యత్నాలు సఫలం
  • బకాయిల చెల్లింపునకు అవకాశం

రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్దరణకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజవంతమయ్యాయి. వైద్య సేవలను నిలిపిన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిలిచిన ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు ఈ రోజు నుంచే తిరిగి ప్రారంభమయ్యాయి. బకాయిలు అన్నింటినీ చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు ప్రకటించారు.

ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి రూ.2,700 కోట్లు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను యాజమాన్యాలు నిలిపివేశాయి. ఈ డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన ప్రభుత్వం రూ.250 కోట్లు చెల్లింపులు చేసింది. ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో ఆస్పత్రుల అసోషియేషన్ ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశమై సమగ్రంగా చర్చించారు.

బకాయిలు మొత్తం వన్ టైం సెటిల్మెంట్: వెంటనే మరో రూ. 250 కోట్లు చెల్లింపునకు హామీ ఇచ్చిన మంత్రి నవంబర్ చివరి కల్లా పెండింగ్ బకాయిలు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే ఆందోళన విరమించి ప్రజలకు వైద్య సేవలన్నింటినీ పునరుద్దరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతోన్న యూనివర్సల్ హెల్త్ స్కీం విధి విధానాలపైనా చర్చించారు. ప్రైవేటు ఆస్పత్రుల అనుమానాలనూ మంత్రి సత్యకుమార్ నివృత్తి చేశారు. ఇన్సూరెన్స్​తో ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కడా అన్యాయం జరగదని, వారి సహకారంతోనే ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. చికిత్సలకు చెల్లించే మొత్తాలను పెంచే అంశంపైనా చర్చించారు. ప్రైవేటు ఆస్పత్రుల సహకారం, భాగస్వామ్యంతోనే ఇన్సూరెన్స్ విధానం అమలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం సమస్యలను ప్రభుత్వం పరిష్కారానికి హామీ ఇచ్చినందుకు తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆశా ప్రతినిధులు ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments