Monday, April 27, 2026
HomeNewsతెలుగు తమ్ముళ్ల తన్నులాట...!

తెలుగు తమ్ముళ్ల తన్నులాట…!

ఇదా పార్టీ క్రమశిక్షణ అంటూ నవ్వుకుంటున్న కార్యకర్తలు
` భీమిలిలో ముష్టిఘాతాలు
` పార్టీలో రగడ పట్ల గంటా సీరియస్
` విచారణకు త్రిసభ్య కమిటీ

తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ పోరు మొదలైంది. పార్టీ పదవులు మాత్రమే కాదు…అన్నింట్లో వాటాల కోసం కక్కుర్తి మరీ పెరిగిపోయింది. భీమిలి అత్యంత వేగంగా అభివద్ది చెందుతుండడంతో ఆయా పనుల్లో వాటాల కోసం కుమ్ములాడుకుంటున్నారు. భోగాపురం నుంచి భీమిలి మీదుగా విశాఖ వరకూ కొత్త రహదారుల నిర్మాణం జరుగుతోంది. వాటిని ఆనుకుని రియల్ ఎస్టేట్ రంగం శర వేగంగా విస్తరిస్తోంది. ఇంకేముందీ…ప్రతీ గ్రామంలోనూ కాసులు గళగళలాడుతున్నాయి. దీంతో అందరికీ వాటాలపై ఆశ పెరిగింది. ఇదే అదనుగా పార్టీ కార్యకర్తల్లోనూ కొత్త ఆశలు చిగురించాయి. ఏకంగా వాటాల కోసం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్నే వేదిక చేసుకుని రెండు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ సంఘటన చూసిన వారంతా ముక్కున వేలేసుకుని ఛీ …వీరి తీరు చూస్తుంటే తన్నుకు చచ్చేలా ఉన్నారనుకుని అక్కడి నుంచి పక్కకు జరిగిపోయారు. గ్రామంలో అంతర్గతంగా ఆ రెండు వర్గాల మధ్య వివాదాలు గత కొద్ది మాసాలుగా వున్నాయి. భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలోనే ఈ యుద్ద వాతావరణం చోటు చేసుకోవడం చూస్తుంటే ఆయా నేతలు కార్యకర్తలు ఎంత బరి తెగించి ఉన్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పైగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేదిక చేసుకుని కొట్టుకోవడం…పార్టీ క్రమశిక్షణ ఏ పాటిదో ఊహించుకోవచ్చు. ఇంతలా బరితెగించడానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో అంతా తలలు పీక్కుంటున్నారు.
ఎమ్మెల్యే గంటా సీరియస్…షోకాజ్ జారీకి ఆదేశం..!
భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో తెలుగుదేశం నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం పట్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో మాట మాట పెరిగి పార్టీలోని కనకల సూరిబాబు, బోని రమణ, కె. వెంకట ఆదినారాయణ, బోని సురేష్ లు.. కనకల వెంకటరమణ, మొకర శంకర్రావు, బోని దుర్గారావు, మొకర శ్రీనులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనిపై రెండు వర్గాల నేతలకు షోకాజ్ నోటీసులివ్వాలని గంటా ఆదేశించారు. ఆనందపురం మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు, పద్మనాభం మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ రమణ, పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారించి నివేదిక అందించాలన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని.. పార్టీ నియమావళిని అనుసరించి చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments