Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshసరుకు రవాణాకు రైల్ పార్సెల్ యాప్

సరుకు రవాణాకు రైల్ పార్సెల్ యాప్

-మొదటగా హైదరాబాద్, విశాఖ,విజయవాడ గుంటూరు, రాజమండ్రి, బెంగుళూరు, చెన్నై నగరాల్లో..
– ఇంటి వద్దనే బుకింగ్
– ఎస్సీ రైల్వే జీఎం శ్రీ వాత్సవ

ఇండియన్ రైల్వే చరిత్రలో పార్సెల్ రవాణాకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే కమర్షియల్ డిపార్టుమెంటులో పార్సెల్ విధానం సుధీర్ఘ కాలంగా సేవలందిస్తున్నా ఈ సరికొత్త విధానం మాత్రం నూతన ఒరవడి తీసుకురానుంది. ఇప్పటి వరకు ఓ ఎత్తయితే ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఈ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇప్పటి వరకు రైల్వేలో భారీ సరుకులు, బైక్ లు, ఎక్కువ దూరం వెళ్లే సరుకులు మాత్రం పార్సెల్ చేసేవారు. కానీ ఈ సారి తక్కువ దూరం వెళ్లే సరుకులు, చిన్న చిన్న అవసరాలు ఉండే వస్తువులను కూడా పార్సెల్ చేసుకోవచ్చు. ఇంటి వద్దనే పార్సిల్‌ బుకింగ్‌, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. మొదటగా 7 నగరాల్లో ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులని అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే.. ఇతర మూడు లాజిస్టిక్ పార్టన్స్‌తో కలిసి డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులకి శ్రీకారం చుట్టింది.

– మీ ఇంటి నుంచే ఈ యాప్ సేవలు..

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడారు. ప్రజలు నేరుగా మీ ఇంటి వద్ద నుంచే ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ సేవలని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ యాప్‌తో అతి సులువుగా, వేగంగా పార్సిల్స్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్‌ లాజిస్టిక్స్‌ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)- బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుందని వివరించారు.

– వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్‌ ..

రైల్‌ పార్సిల్‌ యాప్‌.. ఫస్ట్‌ మైల్‌ (పికప్‌), మిడ్‌ మైల్‌ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్‌ మైల్‌ (డెలివరీ) సేవలను సమగ్ర డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానించేలా ఈ యాప్ సేవలు ఉంటాయని తెలిపారు. ఇది పార్సిల్‌ సేవలను సులభతరం చేస్తుందని తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్‌ సరుకులను బుకింగ్‌ చేయడానికి, ట్రాక్‌ చేయడానికి వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని వెల్లడించారు. పరిశ్రమ, వినియోగదారులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్‌ భాగస్వాములను ఒకే డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి ఈ యాప్‌ని రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments