Wednesday, May 6, 2026
HomeUncategorizedస్పీకర్ పై వీగిన అవిశ్వాసం

స్పీకర్ పై వీగిన అవిశ్వాసం

గళం వినిపించిన విపక్ష ఎంపీలు

సంఖ్యాబలం లేక తుస్సు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మంగళ, బుధవారాల్లో సుదీర్ఘ చర్చ అనంతరం వీగిపోయింది. సుమారు 10 గంటల పాటు సాగిన ఈ వేడివేడి చర్చలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేస్తున్నారని, విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును సభ ముందుంచారు. దీనిపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఇది ఓం బిర్లాపై వ్యక్తిగత పోరాటం కాదని, సభ గౌరవాన్ని కాపాడడానికే ఈ తీర్మానం తెచ్చామని పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అమిత్ షా స్పీకర్ అధికారాలను సమర్థించారు. చర్చలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకం గురించి గానీ, అదానీ-మోదీ సంబంధాల గురించి గానీ మాట్లాడేటప్పుడు స్పీకర్ తనను పదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని కాపాడటానికే స్పీకర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనికి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. ఒక నాయకుడి అహంకారాన్ని తృప్తి పరచడానికి రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అస్త్రంగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం స్పీకర్‌ను తొలగించాలంటే సభలో ఉన్న మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమికి సుమారు 335 మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 230 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఓటింగ్ అనంతరం తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. స్పీకర్ పదవిలో ఓం బిర్లా కొనసాగుతారని సభ స్పష్టం చేసింది. పార్లమెంటు చరిత్రలో స్పీకర్‌పై ఇలాంటి తీర్మానం రావడం ఇది కేవలం నాలుగోసారి మాత్రమే. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రతిపక్షాలు తమ గళాన్ని బలంగా వినిపించగలిగినా, సంఖ్యాబలం ముందు అది నిలవలేకపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments