Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshరాత్రి గస్తీ కట్టుదిట్టం – హైవేపై ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

రాత్రి గస్తీ కట్టుదిట్టం – హైవేపై ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

ప్రజలకు భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. నేరాలకు ఆస్కారం లేకుండా నియంత్రణ చర్యలు చేపడుతూ, నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైవే పై ప్రయాణించే వాహనదారుల భద్రత దృష్ట్యా ‘డ్రైవర్స్ కి ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి గస్తీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను, అదనపు పోలీసు వాహనాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేరాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, హైవే పరిధిలోని కీలక జంక్షన్లు, గ్రామీణ–పట్టణ సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణను పెంచారు. రాత్రి సమయంలో డ్రైవర్లు నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఈ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం ఉపయోగపడుతోందని పోలీసులు తెలిపారు. హైవే పై ఆపివేసిన చెక్ పాయింట్ల వద్ద డ్రైవర్లకు ముఖం కడుక్కునే సదుపాయం కల్పించి, అలసట తొలగిన తర్వాత ప్రయాణం కొనసాగించేందుకు సూచనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన పత్రాల పరిశీలన కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. పోలీసుల చర్యల వల్ల రాత్రి వేళ నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments