ఇంచార్జి కలెక్టర్, కమిషనర్ ఆదేశాలు ,గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్/జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని, రేపటిలోగా (జనవరి 21) అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా, అంచనాలకు తుది రూపం దిద్దాలని సూచించారు.
గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, గత పుష్కరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల సమన్వయం పటిష్టంగా ఉండాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమని స్పష్టం చేశారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, సీఎం సమీక్షకు ముందే శాఖల వారీ ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలని, అంచనాలు ఇంకా సమర్పించని శాఖలు వెంటనే రాష్ట్ర స్థాయి హెచ్‌ఓడీలతో సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలను ఖరారు చేయాలని ఆదేశించారు. ఈసారి గత పుష్కరాల కంటే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశమున్నందున దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఘాట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సమీప ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొంటూ, శాఖల వారీగా విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు అందజేయాలని సూచించారు. అలాగే ఘాట్ల సమీపంలో టెంట్ సిటీల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ ఎల్. చెంచురెడ్డి, అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, ఎస్‌ఈ (ఏపీ ఎపిడిసిఎల్) కె. తిలక్ కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ కూరెళ్ళ గోపినాథ్, జిల్లా టూరిజం అధికారి పి. వెంకట చలం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేపటిలోగా శాఖల వారీ పనుల జాబితా, అంచనాలకు తుది రూపం
RELATED ARTICLES
