: మేడా శ్రీనివాస్
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు నిర్ణయించిన ముహూర్తం తప్పుగా ఉన్నట్లు గుర్తించి, దానిని మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, గోదావరి పుష్కరాలు కేవలం రాజమండ్రి పరిధిలో మాత్రమే జరిగే కార్యక్రమం కాదని, కోనసీమ ప్రాంతంలోని అంతర్వేది వరకు విస్తరించిన పవిత్ర ఘాట్లలో భక్తులు స్నానాలు చేయనున్నారని పేర్కొన్నారు. అందువల్ల పుష్కరాల ఏర్పాట్లను సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆయన అన్నారు.
పుష్కరాల ఏర్పాట్లపై అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి, వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, భద్రత, రవాణా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
