- 6 నెలల కొడుకును చంపి తల్లి ఆత్మహత్య
- కుటుంబ కలహాలే కారణమని అనుమానం
- హత్య కోణాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
- పోలీసుల అదుపులో మృతురాలి భర్త
- సంఘటన స్థలాన్ని జరిగిన డీఎస్పీ శ్రావణి
అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నెలల బిడ్డను చంపి, ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి గురువారం ఉదయం అనకాపల్లి డిఎస్పి శ్రావణి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలు గృహాన్ని పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. ఈ సంఘటనపై వివరాలు పరిశీలిస్తే చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్ సమీపంలో గల కనకమ హాలక్ష్మినగర్ లోని తమ నివాస గృహంలో పోరెడ్డి వీణ (30), ఆమె 6 నెలల బాబు విగత జీవులై కనిపించారు. వీణ మెడకు చీర ఉరి వేసుకున్నట్టుగా ఉండగా.. ఆమె పక్కనే కన్నకొడుకు మృతదేహం ఉంది. మృతురాలు వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన వీణ, అదే జిల్లా వీఎం వలస మండలం కౌడుతండ గ్రామానికి చెందిన ఉమామ హేశ్వరరావు ప్రేమించుకొని, పెద్దల సమక్షంలో గత ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకు న్నారు. వీరికి ఆరు నెలల బాబు వియాన్స్ ఉన్నాడు.

వీరు చోడవరం కనకమహాలక్ష్మినగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోలీసులకు భర్త చెప్పిన వివరాల ప్రకారం.. రోజూలాగే ఉమామ హేశ్వరరావు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పాఠశాల ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూసేసరికి గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని వీణ మృతి చెంది ఉండగా.. మంచం పక్కనే బాబు విగత జీవిగా పడి ఉన్నాడు. బాబును తలగడతో నొక్కి చంపేసి తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి నట్టు సంఘటన స్థలంలో లభించిన వివరాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య కలహాల కారణంగానే వీణ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తు న్నామని చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు చెప్పారు. భర్త పాత్రపై కూడా అను మానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై మృతురాలి తండ్రిని వివరణ అడగ్గా… వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.నిత్యం డబ్బు కోసం వేధించేవాడని తన కూతురు చెప్తూ ఉండేది అని చెప్పారు.మిగతా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. భర్త ఉమామహేశ్వర రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
