మూడు పొక్లైన్‌లు, మూడు లారీలు సీజ్ – ఆకస్మిక తనిఖీలతో అక్రమాల గుట్టు రట్టు
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ త్రవ్వకాలను జయహే పత్రిక లో వస్తున్న వార్తలు స్పందించి గనులు మరియు భూగర్భ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
బిక్కవోలు మండలం కాపవరం గ్రామ పరిధిలోని సర్వే నెం. 15/1ఏ లో జరిగిన తనిఖీల్లో, గతంలో సి.హెచ్. వెంకటేష్ పేరిట మంజూరైన గ్రావెల్ లీజు గడువు ముగిసినప్పటికీ అక్రమంగా త్రవ్వకాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఒక పొక్లైన్‌తో పాటు అక్రమ రవాణాలో పాల్గొన్న మూడు లారీలను (AP 07 TM 4550, AP 02 TH 3980, AP 07 TM 1800) సీజ్ చేశారు.
అదేవిధంగా గోకవరం మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధుల్లో కూడా అనుమతులు లేకుండా గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారించి, అక్కడ ఉపయోగిస్తున్న పొక్లైన్‌లను సీజ్ చేసి స్థానిక రెవెన్యూ శాఖకు సంరక్షణ నిమిత్తం అప్పగించారు. అక్రమ రవాణా వాహనాలను బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
అనుమతులు లేకుండా త్రవ్వకాలు చేయడం ఏపీ చిన్నతరహా ఖనిజ నియమావళి–1966కు విరుద్ధమని పేర్కొన్న అధికారులు, భవిష్యత్తులోనూ ఆకస్మిక తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి. విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీషా, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
