డయాలసిస్ రోగులతో గేమ్స్ ఆడుతున్న అధికార గణం
` తక్కువ రేట్ మెషీన్లు కొని…మిగిలిన మొత్తాన్ని మింగేసిన వైనం
` ఆ మెషీన్లతో నరకం అనుభవిస్తున్న పేద రోగులు
` రూ. కోటిన్నర పాత మెషీన్లకే సరి..!
డయాలసిస్ రోగులు పడే బాధ వర్ణనాతీతం. కళ్లల్లో ప్రాణం పెట్టుకుని ఎప్పుడు వదిలేద్దామా అంటూ డయాలసిస్ రోగులు నిత్యం ఎదురు చూస్తుంటారు. డయాలసిస్ చేయించుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. నరకం అంటే ఎలా ఉంటాదో…ఆ మెషీన్లపై డయాలసిస్ చేయించుకోవడం అంత కష్టం. కిడ్నీలు ఫెయిలై చావుకు మొహమాసిన వారే డయాలసిస్ చేయించుకుంటారని అంటుంటారు. కిడ్నీలు ఫెయిలైన వారు ఆ వెంటనే బతుకు మీద ఆశ చచ్చిపోకుండా ఏదో కొంత కాలం డయాలసిస్ చేయించుకుంటూ జీవించవచ్చని భావిస్తుంటారు. అలాంటి వారికి డయాలసిస్ ఓ వరం. ఇదే అవకాశంగా మలచుకున్నారు మన కేజీహెచ్ ఉన్నతాధికారి. కొత్త డయాలసిస్ మెషీన్లు కావాలని సంబంధిత విభాగ వైద్యులతో ఇండెంట్ లెటర్ తీసుకుని అక్కడి నుంచి తన మార్కు లెక్కలు వేసుకుంటూ….అందరికీ లేఖలు అందిస్తూ…మొత్తానికి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అంతకు ముందు నుంచీ కేజీహెచ్‌ను ఎలా ఉద్దరిస్తున్నదీ గొప్పలు చెప్పుకుంటూ కలెక్టరేట్‌లో తన బిల్డప్ పెంచుకుంటూ కలెక్టర్‌కు ఈ డయాలసిస్ మెషీన్ల కొనుగోలు ఫైల్ అందజేశారు. ముందు కొన్ని కొర్రీలు వేసినా ఇక్కడ నేరుగా ఆ మెషీన్లు కొంటే దొరికిపోతామని భావించిన సదరు అధికారి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఏపీఎంఎసఐడీసీ) ఇంజనీరింగ్ అధికారులను రంగంలోకి దించారు. వాళ్ల ద్వారా కొంటున్నామని చెప్పగానే కలెక్టర్ కూడా ఓకే అనేశారని వైద్య వర్గాలు కోడైకూస్తున్నాయి. అక్కడి నుంచి సదరు అధికారి ఎలా కమీషన్లు కొట్టేయాలో లెక్కలేసుకుని అన్ని విధాల ప్రయత్నించారు. మొత్తానికి 10 మెషీన్లు కొందామనుకున్న కేజీహెచ్ అధికారులు కమీషన్లు కోసం కక్కుర్తి పడి ఆఖరికి 9 మెషీన్లతో సరిపెట్టుకున్నారు. అదేమంటే ఈ అనుమతులన్నింటికీ ఎక్కువ సమయం అయ్యిందని…ఈ కారణంగా మెషీన్ల రేటు పెరిగిపోయిందని నమ్మించారు. రూ. కోటిన్నర సీఎస్సార్ నిధులు ఆ విధంగా తగలెట్టేశారు. తీరా చూస్తే ఆ మెషీన్లు ఏమైనా రోగులకు మేలు చేస్తున్నాయా అంటే అదీ లేదు. వీరు కొన్న మెషీన్లు చెప్పుకోవడానికి గొప్పగానే ఉండొచ్చుగానీ వీటికి అంత సీన్ లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. లో గ్రేడ్ మెషీన్లు కొనడం వల్ల ఒక్కో రోగికి డయాలసిస్ చేయాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అదే హై ఎండ్ మెషీన్లు కొంటే మూడు గంటల్లోనే రోగికి డయాలసిస్ పూర్తయ్యేదని చెప్పుకుంటున్నారు. అంటే కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఆయా కంపెనీల వద్ద మిగిలిపోయిన పాత తరం మెషీన్లు తెచ్చి రోగులు ప్రాణాలు తీస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఓ మాసం క్రితం ఎక్కువ సేపు ఈ మెషీన్లపై డయాలసిస్ చేయించుకోలేక ఒకరు మృత్యువాత కూడా పడ్డారని రుజువు చేస్తున్నారు. కానీ ఈ మొత్తం నెపమంతా నెఫ్రాలజీ విభాగ అధికారులపై నెట్టేస్తున్నారు. కానీ చేసిందంతా ఆ ఉన్నతాధికారేనన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎక్కడా సీన్‌లో లేకుండా భలే నటించారు కదూ…అనుకుంటున్నారు పాపం ఉద్యోగులు.
