కొత్త ఏడాదిలో జగన్ జాతకం
పంచాంగ సిద్ధాంతి మురళీకృష్ణ వెల్లడి
తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి గంటా మురళీకృష్ణ ప్రసాద్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతక ఫలాలను విశ్లేషించారు. ఈ ఏడాది జగన్‌కు గ్రహ గతులు అంత సానుకూలంగా లేవని చెప్పారు. ముఖ్యంగా రాజపూజ్యం 1 ఉండగా, అవమానం 7 గా ఉందని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఆర్థిక పరంగా ఆదాయం 8 ఉండగా, వ్యయం 11 గా నమోదైందని వివరించారు. సిద్ధాంతి విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది జగన్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గౌరవ మర్యాదల కంటే విమర్శలు, ప్రతికూలతలు అధికంగా ఉండే అవకాశం ఉందని పంచాంగం స్పష్టం చేస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి పెరగవచ్చని, ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించాలని సిద్ధాంతి సూచించారు. గ్రహ దోషాల ప్రభావం ఉన్నందున తగిన శాంతి పూజలు, పరిహారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే, ఈ ప్రతికూలతలు శాశ్వతం కావని, సెప్టెంబర్ తర్వాత పరిస్థితుల్లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంకల్ప బలంతో పాటు దైవబలం తోడైతే ఎదురయ్యే అడ్డంకులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. రాజకీయాల్లో పట్టుదల వదలకూడదని, పరిహార మార్గాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని జగన్‌కు సూచించారు.అదే సమయంలో జగన్ జాతక రీత్యా ఈ ఏడాది రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటూనే, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు బలంగా ఉన్నాయని సిద్ధాంతి విశ్లేషించారు. గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల పాలనాపరమైన అంశాల్లో, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చని తెలిపారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని చెప్పారు.
