రూల్స్ పాటించని అధికారుల వివరాలు ఎందుకు చెప్పడం లేదు ? : హైకోర్టు ఆగ్రహం ,విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సిఆర్ జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా తీరానికి సమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందని తెలిసి కూడా చర్యలు తీసుకోని అధికారులపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులను రక్షించేందుకు జివిఎంసి కమిషనర్ ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడింది. బాధ్యులైన అధికారుల వివరాలివ్వాలని కోరితే కమిషనర్ ఇవ్వలేదని ఆక్షేపించింది. వాళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అలాగే గోడ కూల్చడం ద్వారా పోగైన వ్యర్థాలను మూడువారాల్లో తొలగించాలని జివిఎంసి కమిషనర్‌ను చీఫ్ జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావు తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలిచ్చింది. భీమునిపట్నం పరిధిలోని సీఆర్ జెడ్-1 ప్రాంతంలో సము ద్రానికి అతిసమీపంలో మాజీ ఎంపి విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేయడంపై జనసేన కార్పోరేటర్ పిఎల్పీఎన్ మూర్తి యాదవ్ వేసిన పిల్ పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
