Home Politics Andhra Pradesh అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

0

బడ్జెట్ సమావేశాల ముగిసే వరకూ స్టాళ్ల నిర్వహణ
* స్టాళ్ల ద్వారా ప్రఖ్యాత గాంచిన చేనేత వస్త్రాల విక్రయం

* చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడమే లక్ష్యం : మంత్రి సవిత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, బజార్లు, వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. పండగ సమయాల్లో భారీ డిస్కౌంట్లు అందజేస్తూ చేనేత వస్త్రాల వినియోగం పెంచడంతో పాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పించడమే కాకుండా ఆదాయం ఆర్జించేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అసెంబ్లీకి, శాసనమండలికి వస్తున్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే లక్ష్యంతో గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ ఆప్కో ఆధ్వర్యంలో 12 స్టాళ్లను చేనేత, జౌళి శాఖాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తయారవుతున్న ప్రఖ్యాతగాంచిన చేనేత ఉత్పత్తులను ఈ స్టాళ్లలో విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు, మానపల్లి పట్టు, సాధారణ చీరలతో పాటు ఇంటిళ్లపాది వినియోగించుకునే రెడీమేడ్ దుస్తులను ఈ స్టాళ్లలో అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. లుంగీలు, టవళ్లు, దుప్పట్లు, ఇతర చేనేత వస్త్రాలను సైతం అమ్మకానికి పెట్టనున్నారు. గురువారం ఈ స్టాళ్లను ప్రారంభించి, అమ్మకాలు ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బుధవారం పరిశీలించారు. ఏయే వస్త్రాలు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన చేనేత వస్త్రాలను, పట్టు చీరలను అమ్మకానికి పెట్టాలని చేనేత, జౌళి శాఖాధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. చేనేత స్టాళ్లతో పాటు ఫొటో స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చేనేత దుస్తుల వినియోగం పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పలువురు ప్రముఖులు చేనేత ఎగ్జిబిషన్లు సందర్శన, వారు చేనేత వస్త్రాల కొనుగోలు చేసిన, ధరించిన దృశ్యాలను ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. నేతన్నలతో సీఎం చంద్రబాబు నాయుడు సంభాషిస్తున్న దృశ్యాలు కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version