రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు పి.వి.ఎం నాగజ్యోతి గ్రంథాలయ అభివృద్ధి కోసం 30 పుస్తకాలను విరాళంగా అందించారు.
ఈ పుస్తకాలలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం చేసే పుస్తకాలు, కంప్యూటర్ టెక్నాలజీపై అవగాహన కలిగించే పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ స్టడీస్ పుస్తకాలు గ్రంథాలయ పాఠకులకు ఎంతో అమూల్యమైనవిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకులు రాజబాబు , సిఆర్పి సతీష్ మాట్లాడుతూ నాగజ్యోతి సేవాభావం, సమాజానికి మార్గదర్శకంగా నిలిచే ఆమె ఉదార స్వభావం ప్రశంసనీయమని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రంథాలయాలు జ్ఞాన కేంద్రాలుగా మారేందుకు ఇలాంటి దాతృత్వం ఎంతో అవసరమని విద్యావేత్తలు పేర్కొన్నారు. నాగజ్యోతి అందించిన ఈ పుస్తకాలు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉద్యోగార్థులకు కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
గతంలో కూడా కొత్తకోట గ్రంథాలయానికి ఎన్నో పుస్తకాలు విరాళంగా అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విద్యా సేవ పట్ల ఆమెకు ఉన్న అంకితభావం, పుస్తక ప్రేమ, సమాజంపై ఉన్న బాధ్యతాభావం మరోసారి ప్రతిఫలించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
అలాగే రోలుగుంట పాఠశాల గ్రంథాలయానికి కూడా పిల్లల కథల పుస్తకాలు, చిత్రలేఖన పుస్తకాలు వంటి పలు పుస్తకాలను అందించడం జరిగింది. ఇవి చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో, చదువుపై ఆసక్తిని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భవిష్యత్తులో కూడా గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని నాగజ్యోతి తెలిపారు. ఆమె చేసిన ఈ కార్యక్రమం ఇతర ఉపాధ్యాయులు దాతలకు ప్రేరణగా నిలుస్తుందని, మరిన్ని సేవా కార్యక్రమాలకు దారి తీస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రోలుగుంట శాఖా గ్రంథాలయానికి పుస్తకాల విరాళం
RELATED ARTICLES
