క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేస్తున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన ఆలిండియా సీనియర్ నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని పేర్కొన్నారు. భీమిలి మజ్జిపేటకు చెందిన ఎర్రాజీ జ్యోతి పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. పట్టుదలతో శ్రమించి 2025 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు గ్రూప్ -1 ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి ప్రోత్సహించిందని తెలిపారు. విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి గల వారికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా సానియా మీర్జా, మహేష్ భూపతి, లియాండర్ పేస్ వంటి క్రీడాకారులను తయారు చేయవచ్చన్నారు. 19 ఏళ్లుగా పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న అసోసియేషన్ ను గంటా అభినందించారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, పూసపాటి ఊర్మిళ గజపతిరాజు, వి.ఎం.ఆర్.డి.ఎ. జాయింట్ కమిషనర్ కె.రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు
