తెలుగు నాటక రంగ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో తెలుగు నాటక కళా పరిషత్‌ల సమ్మేళనం “వేదిక” ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో, న్యూఢిల్లీ భాగస్వామ్యంతో “భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం”ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు వెల్లడించారు.
2026 ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ ఉత్సవం జరగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
మీడియా సమావేశంలో మాట్లాడిన ముత్తవరపు సురేష్ బాబు మాట్లాడుతూ
“నాటకం కేవలం వినోదం మాత్రమే కాదు… సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతమైన మాధ్యమం. ఆ విలువలను నేటి తరం వరకు తీసుకెళ్లడమే భారత్ రంగ్ మహోత్సవ్ లక్ష్యం” అని అన్నారు.
ఈ ఐదు రోజుల మహోత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, భిన్న భాషల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన నాటక బృందాలు పాల్గొంటున్నాయి. వినోదంతో పాటు సామాజిక సందేశం కలిగిన కథాంశాలతో కూడిన నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేయనున్నాయి. యువతలో నాటక కళపై ఆసక్తి పెంపొందించడం, కళాకారులకు అంతర్జాతీయ వేదిక కల్పించడం ఈ ఉత్సవ ప్రత్యేకతగా నిలుస్తోంది.
కళాకారులకు వసతి, భోజన సదుపాయాలతో పాటు, ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కళా సంభాషణలు, చర్చా వేదికలు కూడా నిర్వహించనున్నారు.
గుంటూరు జిల్లాతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు, కళాభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై భారత్ రంగ్ మహోత్సవ్ను విజయవంతం చేయాలని వేదిక అధ్యక్షులు హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
భారత్ రంగ్ మహోత్సవ్ – గుంటూరులో ఐదు రోజుల అంతర్జాతీయ నాటక సంబరం
RELATED ARTICLES
