భారతదేశ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన పోరాటాలకు అత్యంత సుదీర్ఘమైన గౌరవప్రదమైన నేపథ్యం ఉంది. అయితే ఒక వ్యవస్థీకృతమైన సైన్యంతో శక్తివంతమైన విదేశీ చక్రవర్తిపై భారతీయులు జరిపిన మొదటి అతిపెద్ద ప్రధాన యుద్ధంగా జీలమ్ నది తీరాన సంభవించిన ‘హైడాస్పస్ యుద్ధం’ చారిత్రక రికార్డులలో నిలుస్తుంది. క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో ప్రపంచ విజేతగా కీర్తించబడిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భారతీయ పరాక్రమశాలి పురుషోత్తముడి మధ్య ఈ చారిత్రాత్మక సంగ్రామం జరిగింది. ఈ యుద్ధం భారతీయ వీరత్వానికి పట్టుదలకు దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. అప్పటి వరకు అపజయమే ఎరుగని గ్రీకు సైన్యం భారతీయ సైనికుల ధాటికి మొదటిసారిగా తీవ్రమైన ఆందోళనకు గురైన సందర్భం ఇది.
అలెగ్జాండర్ పర్షియా సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించిన తర్వాత సింధు నదిని దాటి భారత్ లోకి ప్రవేశించాడు. అప్పటికే సరిహద్దుల్లో ఉన్న అనేక చిన్న రాజ్యాలు అలెగ్జాండర్ సైనిక శక్తికి భయపడి లొంగిపోయాయి. కానీ పంజాబ్ ప్రాంతాన్ని పాలించే పురుషోత్తముడు గ్రీకు రాయబారులు పంపిన లొంగుబాటు ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. యుద్ధ భూమిలోనే కలుద్దామని హెచ్చరించి తన మాతృభూమి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటాడు. జీలమ్ నది ఒకవైపు అలెగ్జాండర్ సైన్యం మరోవైపు పురుషోత్తముడి సైన్యం మొహరించాయి. వర్షాకాలం కావడంతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నా గ్రీకు సైన్యం రాత్రివేళ రహస్యంగా నదిని దాటి మెరుపు దాడికి దిగింది. ఇది ఊహించని పరిణామం అయినప్పటికీ పురుషోత్తముడు ఏమాత్రం బెదరకుండా యుద్ధరంగంలోకి దూకాడు.
భారతీయ సైన్యంలో ఏనుగుల దళం అత్యంత కీలకమైన శక్తిగా ఉండేది. గ్రీకు అశ్వికదళం అంతకుముందు ఎప్పుడూ ఇటువంటి భారీ గజదళాన్ని యుద్ధరంగంలో ఎదుర్కోలేదు. ఏనుగుల దాడికి గ్రీకు గుర్రాలు భయభ్రాంతులకు గురై వెనక్కి తగ్గసాగాయి. పురుషోత్తముడి సైన్యం వీరోచితంగా పోరాడుతూ గ్రీకు సైన్యానికి చుక్కలు చూపించింది. గ్రీకు చరిత్రకారులు స్వయంగా రాసుకున్న కథనాల ప్రకారం అలెగ్జాండర్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రక్తపాతంతో కూడిన యుద్ధం ఇదే. పర్షియాలో సాధించిన విజయాల కంటే ఇక్కడ భారతీయులు చూపిన అజేయమైన ప్రతిఘటన అలెగ్జాండర్‌ను విస్మయానికి గురిచేసింది. పురుషోత్తముడి కుమారుడు ఈ యుద్ధంలోనే మాతృభూమి కోసం పోరాడుతూ వీరమరణం పొందాడు. ఆ సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా నేల బురదమయంగా మారింది. దీనివల్ల భారతీయ విలుకారులు తమ భారీ విల్లులను నేలపై ఆనించి బాణాలు వేయడం సాంకేతికంగా కష్టంగా మారింది. ఈ ప్రకృతి సిద్ధమైన అవరోధం గ్రీకు సైన్యానికి అనుకూలంగా మారింది.
చివరికి తీవ్రంగా గాయపడిన పురుషోత్తముడు బందీగా అలెగ్జాండర్ ముందుకు తీసుకురాబడ్డాడు. అలెగ్జాండర్ అతని గంభీరమైన రూపాన్ని చూసి ప్రభావితుడయ్యాడు. నీతో నేను ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు పురుషోత్తముడు ఏమాత్రం తగ్గకుండా ఒక రాజు మరో రాజుతో ఎలా ప్రవర్తిస్తాడో అలాగే అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఈ సమాధానానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ పురుషోత్తముడి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయడమే కాకుండా మరికొన్ని నూతన ప్రాంతాలను కూడా అప్పగించి స్నేహహస్తం అందించాడు. ఈ యుద్ధం భారతీయ సైనిక వ్యూహాలకు గజదళ ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. అలెగ్జాండర్ తన తదుపరి లక్ష్యమైన మగధ సామ్రాజ్యం వైపు వెళ్లకుండా అడ్డుకున్నది కూడా ఈ యుద్ధం అందించిన చేదు అనుభవమే.
ఈ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ సైన్యం భారతదేశం లోపలికి ప్రయాణించడానికి నిరాకరించింది. మగధ సామ్రాజ్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన సైన్యం మరియు నంద రాజుల బలం గురించి విన్న గ్రీకు సైనికులు అలసటతో స్వదేశానికి తిరిగి వెళ్లాలని పట్టుబట్టారు. అలా హైడాస్పస్ యుద్ధం ప్రపంచ విజేత అలెగ్జాండర్ విజయయాత్రకు అడ్డుకట్ట వేసి అతనిని వెనక్కి తిరిగేలా చేసింది. విదేశీయులకు తలవంచడం కంటే పోరాడి మరణించడం మేలనే భారతీయ తత్వాన్ని పురుషోత్తముడు నిరూపించాడు. నేటికీ ఈ యుద్ధం భారతీయ వీరగాథల్లో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది
(సి.హెచ్.ప్రతాప్)
