డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. శనివారం రాజమండ్రి ఓఎన్‌జీసీ వర్క్‌షాప్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాకుండా సమాజాన్ని చైతన్యపరిచే ప్రేరణాత్మక ప్రతీక అని ఆయన అన్నారు. ఉదయించే సూర్యుడిలా అంబేద్కర్ వ్యక్తిత్వం భారత సమాజానికి దిశానిర్దేశం చేసిందని వివరించారు. ప్రపంచంలో అనేక మంది నాయకులకు విగ్రహాలు ఉన్నప్పటికీ తన ప్రతిభ, కృషితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహానుభావుడు అంబేద్కర్ అని చెప్పారు.
అంబేద్కర్ జీవితమంతా దేశాభివృద్ధి మరియు అనగారిన వర్గాల సాధికారత అనే రెండు ప్రధాన లక్ష్యాల కోసం అంకితమైందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలను ముందుకు పెట్టి పనిచేసిన మహానేతగా ఆయన నిలిచారని అన్నారు. సమాజంలో కులమత భేదాలు ఉన్నంతకాలం దేశ ఐక్యతకు ముప్పు ఉంటుందని అంబేద్కర్ హెచ్చరించారని గుర్తు చేశారు.
దళితులు, అనగారిన వర్గాలు తప్పనిసరిగా చదువుకోవాలని అంబేద్కర్ పిలుపునిచ్చారని, చదువుతో పాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపారం, వ్యవసాయం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారని వివరించారు.
“ఎడ్యుకేట్, అగిటేట్, ఆర్గనైజ్” అనే అంబేద్కర్ సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకమని కిషోర్ మక్వానా పేర్కొన్నారు. అంబేద్కర్ కేవలం భారతదేశానికి మాత్రమే నాయకుడు కాదని, ఈ శతాబ్దానికి చెందిన ప్రపంచ నాయకుడని ఆయన అన్నారు.
కార్యక్రమానికి ముందు ఓఎన్‌జీసీ కార్యాలయం నుంచి వర్క్‌షాప్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
