Thursday, April 23, 2026
HomePoliticsAndhra Pradeshఅనాథలను అమ్మలా ఆదరిస్తున్న అభినందన ఫౌండేషన్

అనాథలను అమ్మలా ఆదరిస్తున్న అభినందన ఫౌండేషన్

– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

గుంటూరు నగరంలో ఏటుకూరు సమీపాన సుమారు 60 మంది అనాథ పిల్లలను చేరదీసి అమ్మలా ఆదరిస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న అభినందన ఫౌండేషన్ కృషి అభినందనీయమని జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు.
ఈ నెల 22వ తేదీన శివ ట్యూషన్స్ విద్యార్థి బృందం అభినందన ఫౌండేషన్ బాలబాలికలకు ప్రతిభా పురస్కారాలను అందించింది.
ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ సంతోష సూచికలో ప్రపంచంలో తొలి పది స్థానాలలో ఉండగా, భారతదేశం 116 వ స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా విద్యార్థి దశ నుండే ప్రోత్సహిస్తూ శివ ట్యూషన్స్ అడుగులు వేయటం హర్షణీయమన్నారు. గుంటూరు నగరంలో కోవిడ్ ఫైటర్స్, మానవత, కార్మెల్ సేవా సదన్, నేస్తం ఫౌండేషన్ లాంటి సంస్థలు బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని, అనేక మంది దాతలు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ ప్రసంగిస్తూ అనాధ శరణాలయాల్లోని పిల్లలతో విద్యార్థులు మమేకమవ్వడం, వాళ్లు చదువుకుంటూనే మరికొందరిని చదివించడం అభినందనీయమన్నారు.
శివ ట్యూషన్స్ వ్యవస్థాపకులు వై. మురళీ కృష్ణ ప్రసంగిస్తూ పోటీ పరీక్షలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు యుక్త వయసులోనే సేవా రంగం వైపు అడుగులు వేయడం ఆనందంగా ఉందని, తమ విద్యార్థులు సమకూర్చుకున్న 35 వేల రూపాయలను ప్రతిభాపారితోషకాలుగా అందజేయడం సంతోషకరమన్నారు.
అభినందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె. నిర్మల్ కుమార్ ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించి, వారికి ఉన్నత చదువులు చెప్పించడం సంతృప్తినిస్తోందని, కుటుంబ సభ్యులు, దాతల సహకారంతో ఈ మహత్కార్యం సాధ్యమవుతుందన్నారు.
ఈ సందర్భంగా శివ ట్యూషన్స్ విద్యార్థి బృందం అభినందన ఫౌండేషన్ నందు గల పిల్లలందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు టి. ధనుంజయరెడ్డి, చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు వి. విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు కొడాలి పద్మ, మానవత కార్యవర్గ సభ్యులు మేకల రామారావు, కె. సత్యనారాయణ, బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్, అభినందన ఫౌండేషన్ ప్రతినిధులు కె. పద్మావతి, కె. దినేష్, కె. పావని మౌనిక తదితరులు ప్రసంగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments