Wednesday, April 22, 2026
HomeNewsమోసాల్లో ఘనాపాఠి...!

మోసాల్లో ఘనాపాఠి…!

రూ. కోట్లలో కాజేసిన వడ్డీల వ్యాపారి
` తక్కువ ధరకే భూములిస్తానని మోసాలు
` విస్తుపోయే నిజాలతో ఆశ్చర్యపోతున్న పోలీసులు

మోస పోయే వారుంటే…మోసగించడం మోసగాళ్లకు చాలా సులువు. అలా మోసపోయిన బాధితులంతా ఏకమైనా ఆ మోసగాడిని ఏం చేయలేరు. ఎందుకంటే ఆయన మోసాలతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగల ఘరానా మోసగాడిగా ఎదిగిపోయాడు. అయితే మోసాలు చేసే వారు అన్ని రోజులూ మోసం చేయలేరు. ఏదో ఒక రోజు దేవుడున్నారు…ఆయన చూస్తారు అన్న భయం ఉంటే ఇలాంటి దారుణాలకు ఒడికట్టరని అంతా అంటుంటారు. అలాంటి ఉదంతమే తాజాగా జరిగింది. బాధితులు…పోలీసులు అందించిన వివరాల మేరకు…కాకినాడ జిల్లా సమీప గ్రామానికి చెందిన చింతపల్లి ఇంటి పేరుతో ఉండే ఓ రెడ్డి విశాఖ సీతమ్మధార ఈనాడు జంక్షన్‌లో దశాబ్దాల కాలం కిందటే వడ్డీ వ్యాపారం..తాకట్టు వ్యాపారం మొదలెట్టాడు. ఆ తర్వాత భారీగా డబ్బులు కూడబెట్టాక…అక్కడి నుంచి భూ కబ్జాలు…అద్దెకు తీసుకున్న ఇళ్ల కబ్జాలు మొదలెట్టాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ. లక్షల్లో నగదు కాజేసి వాళ్లకు ఇస్తానన్న భూమి…ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. గత ప్రభుత్వంలో అయితే వైసీపీ నాయకునిగా చెలామణి అవుతూ అందిన కాడికి దోచుకున్నాడు. బడా వ్యాపారవేత్తలు…వైద్యులు…సాంఘిక సేవాసంస్థలు నిర్వహించే వారు…ఇలా ఒకరా…ఇద్దరా…వందలాది మంది బాధితులు ఆయన ఖాతాలో చేరిపోయారు. వీరందరి నుంచి రూ. కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకుని దర్జాగా ఖరీదైన కార్లలో తిరుగుతూ…మోసాల సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. అయితే అనేక ఏళ్లుగా చేస్తున్న మోసాలతో ఆరితేరిపోయి తన వైపు ఎవరి చూపు పడకుండా భారీ ఎత్తున లంచాలు ఎర వేస్తూ పోలీసులను సైతం మేనేజ్ చేసేవాడు. కేఆరఎం కాలనీలో ఆయన ఇంటి వద్ద తరచుగా బాధితులు వచ్చి ఆందోళనలు చేపట్టినా త్రీ ఫోర్ పోలీస్ స్టేషన్లలోని ఆయన అనుయాయుల ద్వారా సర్దుబాటు చేసుకుని దర్జాగా తిరిగేవాడు. అయితే తాజాగా దాదాపు 10 మంది బాధితులు ఆయన ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. గట్టిగా నిలదీయడంతో చేసేది లేక ఎప్పటి లాగే వాళ్లను బెదిరించేందుకు 100కు డయల్ చేసి ప్రత్యర్ధులను కట్టడి చేద్దామనుకుని ఇరుక్కుపోయాడు. అప్పటికే ఆయన గురించి తెలిసిన పోలీసులు ఆయన మోసాల చిట్టాను చూసి ఆశ్యర్యపోయారు. తవ్వేకొద్దీ ఆయన అవినీతి లీలలు బయటపడుతుండడంతో మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఆఖరికి పెందుర్తికి చెందిన ఓ అనాధ ఆశ్రమం నిర్వాహకురాలిని కూడా రూ. లక్షల్లో మోసగించినట్టు తెలిసింది. బాధితుల చిట్టా పెరుగుతుండడంతో పాటు నగరంలోని వివిధ స్టేషన్ల పరిధిలో బాధితులుండడంతో నగర పోలీసులు మరింత కట్టుదిట్టంగా ఆయన నేర ప్రవత్తిని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన భార్య ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు. ఆస్తులు ఎక్కడ కూడబెట్టారన్న దానిపై నిఘా పెట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments