అత్యుత్తమ ఫలితాలు సాధించండి
విద్యార్థులకు మంత్రి సవిత పిలుపు
నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి కావొద్దని, మానసిక ప్రశాంతతతో పరీక్షలు రాసి, అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభం కాబోయే పదో పరీక్షలకు 13,604 మంది బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వారిలో బీసీ హాస్టళ్ల విద్యార్థులు 8,068 మంది, ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 5,536 మంది ఉన్నారన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, మెటీరియళ్లు అందజేశామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యార్థి దశలో పదో తరగతి ఎంతో కీలకమన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ, ఉపాధ్యాయుల దిశానిర్దేశంలో అత్యుత్తమ మార్కుల సాధించాలన్నారు. పరీక్షలకు మానసిక ప్రశాంతతతో హాజరుకావాలని, ఎటువంటి ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి కావొద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు. టెన్త్ విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్లతో ముందుగానే చేరుకోవాలన్నారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో మౌలిక సదుపాయలు, పౌష్టికాహారంతో కూడిన మెనూ అందిస్తోందన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. గతేడాది ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ ఏడాది కూడా ఎంజేపీ విద్యార్థులతో పాటు బీసీ హాస్టళ్ల విద్యార్థులు కూడా టెన్త్ పరీక్షల్లో వంద శాతం మేర ఉత్తీర్ణతా శాతం సాధించి, కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి ఆకాంక్షించారు. డీబీసీడబ్ల్యూవోలు, ఇతర సిబ్బంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంటే ఉండాలని, పరీక్షలు అవ్వగానే వారిని తిరిగి హాస్టళ్లకు, ఎంజేపీ స్కూళ్లకు క్షేమంగా తీసుకురావాలని మంత్రి సవిత ఆదేశించారు.
