ప్రజలు భయాందోళన చెందవద్దు: కలెక్టర్ కీర్తి చేకూరి
సంయమనం పాటించాలి: ఎస్పీ డి. నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం నగరంలో నమోదైన ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వై జంక్షన్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ, పశుసంవర్థక శాఖలు మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
డయాలసిస్ అవసరమైన 12 మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరందరికీ ఒకే పాలవ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ వ్యాపారి పాలు సరఫరా చేసిన 106 కుటుంబాలకు రక్తపరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు 73 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించినట్లు వెల్లడించారు. నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
పశుసంవర్థక శాఖ 46 పశువులకు పరీక్షలు నిర్వహించి నమూనాలను ప్రయోగశాలలకు పంపింది. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు నమూనాలను హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్‌లకు పంపారు. నివేదికలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర నివేదిక కోరినట్లు తెలిపారు. బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతో పాటు మూలకారణాలను త్వరితగతిన గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9494060060ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. మృతులు ఎన్. శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి కృష్ణవేణి (76), తాడి రమణి (58)గా గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉన్నట్లు చెప్పారు. అనధికార డెయిరీని సీజ్ చేసి పాలవ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువగా ప్రభావితమైనట్లు గుర్తించామని, కొన్ని రోజులు పాలను బాగా మరిగించి మాత్రమే వినియోగించాలని ప్రజలకు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు నమోదైనట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరినట్లు చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. పి.వి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులు
RELATED ARTICLES
