చౌడేశ్వరి నగర్‌లో బాథిత కుటుంబాలకు భరోసా
రాజమహేంద్రవరం నగరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం బోలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వివరంగా మాట్లాడి, అందిస్తున్న వైద్యసేవలపై సమాచారం తీసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర వైద్యసంస్థలకు తరలించే చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం చౌడేశ్వరి నగర్‌లో పర్యటించిన జక్కంపూడి విజయలక్ష్మి, కల్తీ పాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పి ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల సమస్యలను స్వయంగా తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కల్తీ పాల ఘటన అత్యంత దురదృష్టకరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.
కల్తీ పాల ఘటనపై జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన
RELATED ARTICLES
