తెలుగు మ్యాట్రిమోనీ, షాదీ డాట్ కామ్లను ఆసరాగా చేసుకుని ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరగాడిని రాజమండ్రి టౌన్ (లా అండ్ ఆర్డర్) పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలకు వివాహ ప్రపోజల్స్ పంపి, జాతకం–పూజల పేరుతో నమ్మబలికి రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లకు రప్పించి, వారి బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ ఆదేశాలతో, సెంట్రల్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఏ.వి. అప్పారావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు కేసులను ఛేదించాయి. నిందితుడు చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణను అరెస్ట్ చేసి, ఐదు కేసుల్లో రూ.75 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులను సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
