ఎంపీ భరత్ ఆక్రమణలను అడ్డుకుంటాం 54 ఎకరాల భూ క్రమబద్దీకరణ జరగనీయం 29న భూములను మేమంతా పరిశీలిస్తాం కౌన్సిల్ లోనూ ఆమోదం చేయనీయం వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్, కె కె విశాఖలోని గీతం యూనివర్సిటీ భూ బదలాయింపులకు వ్యతిరేకంగా వైసిపి పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అగ్రనేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్, కుంభా రవిబాబు, విశాఖ వైసీపీ అధ్యక్షుడు కే కే రాజులతో కలసి మాట్లాడారు. ఎంపీ భరత్ కుటుంబ సంస్థ అయిన గీతం యూనివర్శిటీకి అత్యంత విలువైన భూములు కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈనెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వ్యతిరేకించాలని కార్పొరేటర్లకు పార్టీ నిర్దేశించిందని వెల్లడించారు. ఎంపీ భరత్ బరితెగింపుకు ఈ భూములు వ్యవహారం నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ భరత్ కు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ప్రజల భూములు కాజేసే ప్రయత్నం చేసినందుకు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. గతంలో జరిగిన కేటాయింపులు, ప్రస్తుతం క్రమబద్ధీకరణ నిర్ణయంపై సీబీఐ విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేసారు. గీతం యూనివర్శిటీ ముసుగులో ఇప్పటి వరకు 25 వేల కోట్ల రూపాయల విలువైన భూమి చేతులు మారిందని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, గీతం కబ్జాలను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రకటించామని, విశాఖ కౌన్సిల్ నుంచి పార్లమెంట్ వరకు ఎంపీ భరత్ భూ దోపిడీని ఎదుర్కొంటామని ఉద్ఘాటించారు. తన ఆక్రమణలో ఉన్న భూమిని ఎంపీ భరత్ తక్షణం ప్రభుత్వానికి సమర్పించాలని డిమాండ్ చేసారు. 2005నుంచి గీతం ఆక్రమించడానికి సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని అమర్ కోరారు. ప్రజలకు ప్రవచనాలు చెబుతున్న భరత్ కుటుంబం విశాఖలో భూములు కొట్టేసిందని మండిపడ్డారు. కబ్జాలు, దగుల్బాజీ పనులు చేసేది టీడీపీ వాళ్ళు నిందలు వేసేది ఇతర పార్టీల మీద అని అమర్ ఆక్షేపించారు. వైసీపీ విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, విశాఖ ఎంపీ భరత్ అక్రమాలపై ప్రజా పోరాటం ఆగబోదని స్పష్టం చేసారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి గీతం భూముల రెగ్యులరైజేషన్ తొలగించాలని కమీషనర్ ను కోరతామని వెల్లిడంచారు. ఈనెల 29న కబ్జాకు గురైన భూములను వైసిపి బృందం పరిశీలనకు వెళుతుందని కన్నబాబు తెలిపారు. గీతం యూనివర్శిటీ భూ దాహానికి, బరి తెగింపునకు 54 ఎకరాల ఆక్రమణలు నిదర్శనం అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దోపిడీలని, సెంటు భూమి పేదవాడు అక్రమిస్తే కట్టడి చేసే జీవీఎంసీ, 54 ఎకరాలను ఏ విధంగా రెగ్యులర్ చేయాలని చూసిందని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం చేస్తున్న తప్పులకు ఇది పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. తొడల్లుడు విద్యా సంస్థకు భూములు కేటాయించమని లోకేష్ ఏ విధంగా లేఖ రాస్తారని ప్రశ్నించారు.
