Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshపీలా బ్రదర్స్ ప్రొటోకాల్ వార్

పీలా బ్రదర్స్ ప్రొటోకాల్ వార్

హోం మంత్రిపై పీలా గోవింద్ చిందులు జిల్లా కలెక్టర్ పై మేయర్ పీలా శ్రీను ఆగ్రహం తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీలా ఫ్యామిలీ టీడీపీకి నమ్మిన బంటు వంటిది.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకుని రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పీలా మహలక్ష్మి నాయుడు దగ్గర నుంచి టీడీపీ అధిష్టానం కూడా ఆఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. విశాఖ జిల్లాలో గవర సామాజికవర్గం నుంచి అత్యంత బలమైన నాయకత్వం సాగించారు. మహలక్ష్మీ నాయుడు తర్వాత ఆయన కుమారులు రాజకీయ రంగంలోకి వచ్చారు. వ్యాపార వ్యవహారాలు సాగిస్తూ రాజకీయాల్లో

యాక్టివ్ గా ఉంటున్నారు. పీలా శ్రీనివాసరావు ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు. మరో కుమారుడు పీలా గోవింద్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గతంలో పని చేసి ప్రస్తుతం అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో తిరుగులేని హవా సాగిస్తున్నారు. మేయర్ గా విశాఖ వ్యవహారాల్లో రాజకీయ పెత్తనం కూడా సాగిస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే స్థానం సీట్ల సర్దుబాటులో జనసేనకు వెళ్లిపోవడంతో పీలా గోవింద్ కు టికెట్ దక్కక కార్పొరేషన్ పోస్టుతో సరిపెట్టుకున్నా సరే, తన పొలిటికల్ ఇమేజ్ ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ కూటమి పాలనలో టీడీపీ నేతగా అజమాయిషీ చెలాయిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా సరే, విశాఖ పాలిటిక్స్ లో ఈ పీలా బ్రదర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. క్యాడర్ మీద, ఛోటా నేతలపై చిర్రుబుర్రులాడటం అలవాటుగా మారినా, పెద్ద పెద్ద బహిరంగ వేదికలపై ఎన్నడూ రచ్చ చేసినదీ లేదు. అయితే ఇటీవల ఈ బ్రదర్స్ ఇద్దరూ రెచ్చిపోయారు. అనకాపల్లిలో పీలా గోవింద్ నానా యాగీ చేస్తే, ఎన్నో రోజుల గ్యాప్ లేకుండా ఆయన సోదరుడు మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖలో చెలరేేేగిపోయారు. హోమ్ మంత్రి అనితపై పీలా గోవింద్ నడిరోడ్డు మీద చిందులు వేయగా, విశాఖ బీచ్ రోడ్డులోని విశాఖ ఉత్సవ్ వేదికపై మేయర్ పీలా శ్రీనివాసరావు ఏకంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు వార్నింగ్ లు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇద్దరి సోదరులను కార్నర్ చేసింది. ఇటీవల హోం మంత్రి అనిత అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని ఆమె తిరిగి పయనమైన సమయంలో తన అనుచరులుతో కలసి అనితతో మాట్లాడేందుకు పీలా గోవింద్ ప్రయత్నాలు చేసారు. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా పీలా గోవింద్ ను గమనించకుండా హోం మంత్రి తన కారెక్కి వెళ్లిపోయారు. తాను పిలిచినా సరే కనీసం ఖాతరు చేయకుండా కారెక్కి వెళ్లిపోవడమేంటని పీలా గోవింద్ హోం మంత్రి అనితకు నేరుగా ఫోన్ కాల్ చేసారు. తన క్యాడర్ ముందు స్పీకర్ పెట్టి మాట్లాడారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, అంత ఖాతరు లేకుండా, లెక్క చేయకుండా వెళ్లిపోవడం ఏంటని రుసరుసలాడారు. దీంతో అనిత పరిస్థితిని వివరించి సర్ధి చెప్పుకోవాల్సి వచ్చింది. తన అనుచరుల ముందు తనకు అవమానం జరిగిందంటూ పీలా గోవింద్ నానా యాగీ చేయడం చర్చానీయాంశంగా మారింది. మరి ఇగో విషయంలో సొదరుడు పీలా గోవింద్ కు తానేం తక్కువ తినలేదంటూ మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా రెచ్చిపోయారు. ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవ్ ను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ప్రారంభోత్సవ సమయంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే సభా వేదిక వద్దకు మంత్రులు అనిత, బాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రులంతా పెద్ద ఎత్తున ఒకే సమయంలో చేరుకున్నారు. దీంతో వేదికపై సీట్ల సర్దుబాటులో భాగంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ జోక్యం చేసుకుని మేయర్ పీలా శ్రీనివాసరావును మరో చోటకు మారాలని సూచించారు. అంతే మేయర్ ఒంటికాలితో కలెక్టర్ పై లేచి చుర్రుబుర్రులాడారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ అంటే కనీసం గౌరవం లేదా.. నన్నే సీటు మారమంటారా.. ప్రొటోకాల్ తెలియదా.. నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికీ కలెక్టర్ సర్ది చెప్పబోయినా సరే పీలా శ్రీనివాసారవు ఏమాత్రం పట్టించుకోలేదు. వేదికపై నుంచి కిందకు వెళ్లిపోయారు. ఇటు ఉత్సవ్ ఓపెనింగ్ కు వచ్చిన ప్రజలు, అటు ప్రజాప్రతినిధులు ఈ ఘటన చూసి విస్తుపోయారు. పీలా సోదరులు ఒంటి కాలిపై లేచి చిందులేయడం ఇదేం కొత్తకాదని రాజకీయవర్గాలు ఇప్పుడు ఉదహరిస్తున్నాయి. ఎన్నికల సయమంలో టీడీపీ అధిష్టానం అనకాపల్లి ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించడంతో అప్పటి టికెట్ ఆశావహుడు గోవింద్ సృష్టించిన రభస అంతా ఇంతా కాదంటున్నారు. ఏకంగా చంద్రబాబును వ్యతిరేకిస్తూ తన క్యాడర్ ను రంగంలోకి దించి దిష్టిబోమ్మలు తగులపెట్టడం, ఫ్లెక్సీలు చించడం, చంద్రబాబు, లోకేశ్ తదితరులపై దూషణలు ఎవరూ మరిచిపోలేదని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే పీలా శ్రీనివాసరావు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ సీటు టార్గెట్ గా బరిలోకి దిగారు. టీడీపీకి ఎక్కువ స్థానాలు వస్తే మేయర్ సీటు ఆఫర్ చేయడంతో కొద్ది మంది పోటీదారులకు ఫైనాన్షియల్ గా సపోర్టు చేయాల్సి వచ్చింది. అలాగే గ్రేటర్ విశాఖ అంతా బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పీలా శ్రీనివాసరావు కూడా విశాఖలో పలువురు కీలక నేతలపై చీటికి మాటికిీ చిర్రుబుర్రులాడేవారట. అప్పట్లో పార్టీ పరిస్థితుల దృష్ట్యా నేతలంతా సర్దుకుపోయారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సరే ఈ పీలా సోదరులు సీన్ ఏ మాత్రం మారడం లేదని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట. చీటికి.. మాటికీ అలక పాన్పు ఎక్కడం లేకుంటే, సహనం కొల్పోయి, కోపంతో పక్క వారిపై రెచ్చిపోవడం అలవాటుగా మారిందని బుర్ర బాదుకుంటున్నారట. తండ్రి మహలక్ష్మి నాయుడు పార్టీకి వీరవిధేయుడని గుర్తించి కుమారులు ఛాన్స్ లు ఇస్తే ఇలా రోడ్ల మీద వీరంగం వేసి పార్టీని బజారుకు ఈడుస్తున్నారని లబోదిబోమంటున్నారట. ఈ అన్నదమ్ముల వ్యవహర తీరు ఎప్పుడు మారుతుందో.. తమకు ఎప్పుడు ఈ తలపోటు తప్పుతుందోనని నిట్టూర్చడమే మిగిలిందని తమ్ముళ్లు బావురుమంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments