77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పెరవలి మండలం తీపర్రుకు చెందిన యువ కళాకారుడు కోడూరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు చాక్‌పీస్‌పై గణతంత్ర దినోత్సవ సందేశాన్ని లిఖిస్తూ తన కళా ప్రతిభను స్ఫూర్తివంతంగా ప్రదర్శించారు. దేశభక్తి, రాజ్యాంగ విలువలు, జాతీయ ఐక్యత ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కళాఖండం హాజరైన వారిని ఆకట్టుకుంది.
ఈ ప్రత్యేక కళాఖండాన్ని ఆయన ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌కు అందజేయగా, ఆమె కళాకారుడిని అభినందించారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందించడంలో ఇటువంటి సృజనాత్మక ప్రయత్నాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, విద్యార్థులు, ప్రజలు కళాకారుడి ప్రతిభను ప్రశంసిస్తూ చప్పట్లతో అభినందించారు. గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన సందేశాన్ని అందించిన ఈ కళా నివేదన అందరిలోనూ దేశప్రేమను మరింత బలపరిచింది.
