ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటులు శోభన్ బాబు . భట్టిప్రోలు
అందాల నటుడు, కరుణా సముద్రుడు శోభన్ బాబు అని, 230కి పైగా చిత్రాల్లోను కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని
అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు, శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రమణ్యం అన్నారు. నట భూషణ్ శోభన్ బాబు18వ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్వర్యంలో భీమవరంలో శ్రీవెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ముందుగా శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ 1959లో ‘దైవబలం’ చిత్రంతో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్ల కృషి తర్వాత తాసిల్దార్ గారి అమ్మాయితో స్టార్ హీరోగా నిలిచారని, 100 రోజులు ఆడిన చిత్రాలు, ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలతో ‘సోగ్గాడు’గా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారన్నారు. శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు మాట్లాడుతూ ఇప్పటికీ శోభన్ బాబు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతి సందర్భంగా భీమవరంలో సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పెదపాటి రాజబాబు, కారుమూరి భాస్కరరావు, లోయ బెనర్జీ, అడ్డాల సత్యనారాయణ, కంచర్ల భాస్కరరావు అభిమానులు పాల్గొన్నారు.
