మృత్యు రహదారులు: నిర్లక్ష్యం ఎవరిది? బలయ్యేది ఎవరు?
ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, ఎన్నో కుటుంబాలను అంధకారంలోకి నేడుతున్నాయి .
ఎంతో మంది కన్నవారికి కడుపుకోతను మిగిలిస్తున్నాయి..
సంతోషంగా ప్రారంభమైన ఎన్నో ప్రయాణాలు నేడు శవయాత్రలుగా మారుతున్నాయి..
మన రహదారులు ప్రయాణ మార్గాలుగా కాకుండా, రక్తం మరిగిన మృత్యుశాలలుగా మారిపోయాయి.
ఇటీవల జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యానికి, వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనాలుగా మారాయి
“ప్రాణం ఒక్కటే దానికి ప్రత్యామ్నాయం లేదు” అనే సత్యాన్ని మరిచిపోయిన మనిషి నిర్లక్ష్యమే,
నేటి రహదారులపై “మరణ శాసనాలు” రాస్తోంది..
చావుకూడా భయపడే విషాదాలు!
తాజాగా జరిగిన కర్నూలు మరియు చేవెళ్ల బస్సు ప్రమాదాలు సమాజం మనసునే కుదిపేశాయి.
తప్పు ఎవరిదైనా, ఫలితాలు మాత్రం భయానకంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి.
చేవెళ్ల ఘోరం: రాంగ్ సైడ్‌లో మృత్యురథం!
చేవెళ్ల–మీర్జాగూడ వద్ద రాంగ్ సైడ్‌లో దూసుకొచ్చిన అధిక లోడుతో ఉన్న కంకర లారీ
ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ఒక్క క్షణంలోనే 20 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
వాటిలో మూడు నెలల పసికందు కూడా ఉంది!
గతంలో ఈ లారీపై అనేక ఉల్లంఘనలు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం,
చెక్‌పోస్టుల్లో అవినీతి, నిర్లక్ష్యం నియంత్రణ వ్యవస్థల అసమర్ధత ఈ ఘోరానికి మూల కారణాలుగా నిలిచాయి.
కర్నూలు అగ్నిగోళం: అతివేగం, మద్యం నింపిన విషాదం
కర్నూలు జాతీయ రహదారిపై మద్యం సేవించి బైక్ నడిపిన యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడగా,
దానిని గమనించని స్లీపర్ బస్సు బైక్ పైకి దూసుకెళ్లింది. క్షణాల్లోనే బస్సు అగ్నిగోళమై 19 మంది సజీవ దహనం అయ్యారు. మద్యం మత్తు, అతివేగం ఈ రెండు నిర్లక్ష్యాలే ఎన్నో కుటుంబాల భవిష్యత్తును అంధకారం చేశాయి..
గణాంకాలు చెబుతున్న మృత్యు వాస్తవాలు
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.
అంటే ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం రోడ్డు మీద తుడిచిపెట్టుకుపోతోంది.
ఇందులో 70% మంది యువతే (18–45 ఏళ్లు) ఉంటున్నారు ఇది
దేశ భవిష్యత్తను ప్రశ్నార్థకంగా మారుస్తుంది..
ఈ నిర్లక్ష్యం ఎవరిది?
ప్రమాదాలకు కారణం ఒక్క డ్రైవర్ మాత్రమే కాదు
వ్యవస్థాగత లోపాలు , వ్యక్తిగత నిర్లక్ష్యం , రోడ్ల దుస్థితి అన్నీ వీటికి కారణాలుగా ఉన్నాయి
వ్యవస్థాగత వైఫల్యాలు
చెక్‌పోస్టులు నియంత్రణ కేంద్రాలుగా కాకుండా వసూళ్ల కేంద్రాలుగా మారాయి.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకోలేకపోవడం.బస్సుల ఫిట్నెస్ తనిఖీలు సక్రమంగా జరగకపోవడం .ప్రభుత్వ బస్సులే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి
వ్యక్తిగత నిర్లక్ష్యం
మద్యం సేవించి వాహనాలు నడపడం ఇది సామూహిక హత్యాయత్నం వంటిది.
అతివేగం, నిద్రలేమి, మొబైల్ ఫోన్ వినియోగం ఇవి కూడా చాలా ప్రమాదాలకు కారణం
హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించడం, వేగ పరిమితులు లెక్కచేయకపోవడం వంటివి,
రోడ్ల నాణ్యత లోపాలు
గుంతలు, తప్పు డిజైన్లు, సరైన లైటింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం
ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి
పరిష్కార మార్గాలు
ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు ప్రతి పౌరుడి బాధ్యత.
ప్రభుత్వాలు ప్రమాదాలు జరిగాక నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కదా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి..
రోడ్ల మరమ్మతులు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఆటో ఫైన్ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
చెక్‌పోస్టు అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
వాహనాల ఫిట్నెస్ తనిఖీలను నిరంతరం చేయాలి.
డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు.
రాంగ్‌సైడ్, ఓవర్‌లోడ్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి.
ప్రతి ప్రయాణం ముందు వాహనం స్థితిని చెక్ చేయాలి.
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.
నిర్లక్ష్య డ్రైవింగ్ గమనిస్తే ఫిర్యాదు చేయాలి
వాహనాన్ని నడిపేది యంత్రం కాదు మనిషి అని గుర్తుంచుకోవాలి,
ఆ మనిషి బాధ్యతతో, మానవత్వంతో వ్యవహరిస్తేనే రోడ్లు ప్రయాణాలు సురక్షితమవుతాయి.
వేగం కన్నా ప్రాణం మిన్న,
జాగ్రత్తగా వాహనాలను నడిపించండి, అజాగ్రత్తతో వ్యవహరించి
మరొకరి జీవితాన్ని మరణ గమ్యంగా మార్చకండి..
ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరికి జీవితకాల శిక్ష కావొద్దు ..

జి. అజయ్ కుమార్
సామాజిక విశ్లేషకులు