ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని ఆరోపణ
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాలు విషాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది బాధితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం ఐదుగురు మాత్రమే ప్రభావితమయ్యారని “కాకి లెక్కలు” చెబుతోందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు.
జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడంపైనే దృష్టి సారిస్తోందని విమర్శించారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందినప్పటికీ కూటమి నాయకులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో సుమారు 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారం రోజులుగా సంఘటన చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని జక్కంపూడి రాజా విమర్శించారు. ఇప్పటికే బాధిత కుటుంబాలు వైద్యం కోసం సుమారు రూ.8.50 లక్షలు ఖర్చు చేశాయని, ఈ సహాయం “ముష్టి వేసినట్టే”నని అన్నారు. పాలు ఎలా కల్తీ అయ్యాయన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. బాధితులకు పూర్తిస్థాయి ఉచిత వైద్య సేవలు అందించాలని, లేదంటే కుటుంబాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించి నిర్లక్ష్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనపై వైసీపీ నేతల ఆగ్రహం
RELATED ARTICLES
