Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshసేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం అవ్వాలి - టి. అరుణ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త, సేవాతత్పరులు

సేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం అవ్వాలి – టి. అరుణ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త, సేవాతత్పరులు

సేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం అవ్వాలి
– టి. అరుణ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త, సేవాతత్పరులు

నేటి సమాజంలో నెలకొని ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టాల్సింది యువతేనని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సామాజిక మాధ్యమాలను సేవా కార్యక్రమాల పరిధిని విస్తృత పరిచేందుకు వినియోగిస్తే సత్ఫలితాలను సాధించగలమని ప్రముఖ వ్యాపారవేత్త, సేవాతత్పరులు టి. అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈనెల 15వ తేదీన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన సేవా సంస్థలు, విద్యార్థి సంఘాల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన టి. అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ మహాశివరాత్రి పర్వదినాన దైవాంశ సంభూతులైన సేవామూర్తులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందదాయకమని తెలిపారు. నేటి సమాజంలో దాతృత్వం గలవారికి కొదవలేదని, విరాళాలు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనే దానిపై అస్పష్టత నెలకొని ఉందని, సమాజంలో గల అవసరాలు, దాతల మధ్య స్వచ్ఛంద సేవా సంస్థలు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తమ మిత్ర బృందంతో కలిసి నగరంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంస్థలకు తోడ్పాటును అందిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రముఖ వైద్యులు, బిపి మండల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ అన్ని మతాలు, అన్ని ఇజాలు చెబుతున్నది సర్వేజనా సుఖినోభవంతు అని, కుల మతాలకతీతంగా నగరములోని సేవా సంస్థలన్నీ కలిసి పనిచేయడం ప్రశంసనీయమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో ఒక్కో సంస్థ ఒక్కో రంగంలో కృషి చేస్తుందని, ఇలా నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పనిచేస్తున్న సేవా సంస్థలన్నింటినీ ఏకత్రాటి పైకి తీసుకొచ్చి సేవల పరిధిని మరింత విస్తృతపరిచేలా కృషి జరుపుతున్నట్టు తెలిపారు.
ఈ ముఖాముఖి కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి. ధనుంజయ రెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లాబక్షు, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ నేత కె. యశ్వంత్, అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్నా పోతురాజు, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సుభాని, కార్మల్ సేవా సదన్ కె. వీర శేఖర్, కె.బి.ఆర్ ఫౌండేషన్ కె. బాలరాజు, అభినందన ఫౌండేషన్ కె. నిర్మల్ కుమార్, కళాభారతి అంధుల పాఠశాల కె. రవీంద్ర రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి తదితర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments