పదోతరగతి విద్యార్థులకు మంత్రి కింజరాపు శుభాకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమవుతున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే దిశగా ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు విద్యార్థులు మరో కీలక అడుగు వేస్తున్న ఈ సమయంలో లక్ష్యంపైనే దృష్టి పెట్టి శ్రమించాలని మంత్రి సూచించారు. కష్టపడి చదివిన ప్రతిఫలం తప్పక లభిస్తుందని, ధైర్యంగా పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం కల్పించడం, అవసరమైన చోట వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు.
