ఎంవీపీ కాలనీలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీమద్భాగవత ప్రవచనాలు
భగవంతుని గుంరించి చెప్పేదే భాగవతం అని ప్రవచన విరించి, వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, సెక్టార్ 6, శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన ఎబీసీ పార్కులో గురువారం నుంచి మార్చి నాలుగో తేదీ బుధవారం వరకూ 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం మొదలైంది. భాగవతం చెప్పేవారు శ్రద్ధగా చెప్పాలి. వినేవారు దీక్షతో వినాలి. రోజూ రెండుపూట్లా చెబితే సప్తాహం అంటారు. అర పూట చొప్పున ఈ 14 రోజులు జరిగే యజ్ఞాన్ని కూడా అలాగే భావించాలని సామవేదం వివరించారు. 18వేల శ్లోకాల సంపుటమైన భాగవతంలో సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు, భక్తుల కథలుంటాయి. ప్రధాన ఘట్టాలు చెబుతూ మూడు నాలుగు చోట్ల ఇది తెలిస్తే భాగతవం తెలిసినట్టే అని ఉంటుంది. సృష్టిని చేసినవాడు, సృష్టిలో ఉన్నవాడు భగవంతుడంటే స్వరాట్ స్వయం ప్రకాశ స్వరూపుడు అని దీనర్ధం అన్నారు. భాగవతం వేదం నుంచి వచ్చింది. వేదమే ఇతిహాసం. వేదానికి కొమ్మలు ఉపనిషత్తులు అని సామవేదం ప్రవచనంలో పూసగుచ్చినట్టు వివవరించారు. భాగవతంలో రాగద్వేషాలకు అతీతమైన నిష్కపట భక్తిని తెలుసుకోవాలని ఆయన చెప్పారు. భక్తులు తమ బుద్ధిని ఆయనతో అనుసంధానం చేసి ధ్యానిస్తే మయ అనే పొర తొలగిపోయి ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడగల్లుతారు. ఉదాహరణకు భక్త రామదాసు భగవంతునిలో తదాత్మ్యం చెందుతూ అంతా రామమయం… ఈ జగమంతా రామమయం అని వర్ణంచినట్టని ఆయన ఉటంకించారు. వేదవ్యాస మహర్షి విరచితం అని చెప్పే భాగవతం ఆయనకు నారదుని ద్వారా కలిగిన జ్ఞానమని, నారదుడికి నారాయణుడి నుంచి నారాయణుడికి బ్రహ్మ నుంచి సంక్రమిచాయన్నారు. మనిషిలో నుంచి శారీరక, వస్తురూపేణా, ప్రాకృతిక కల్లోలాలు (దైవికం) ఈ మూడు రకాల తాపాలను తాపత్రయం అంటారు. అది పోవడమే కైవల్యం అని వివరించారు.
భక్తులచేత సంకల్పం చెప్పించి అనంతరం ప్రవచనం మొదలుపెట్టారు. ఈ 14 రోజుల ప్రవచన యజ్ఞాన్ని సామవేదం షణ్ముఖ శర్మ జ్యోతి ప్రదీపనతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కందాళ శ్యామ్ ఆధ్వర్యంలో ఋషిపీఠం, విశాఖ సత్సంగ్ నిర్వాహకుల తరపున టి. శ్రీనివాస్, పద్మావతి దంపతులు, ఆదినారాయణ మూర్తి, వనజ దంపతులు, నాగేశ్వర రావు, ఉమాబాల దంపతులు, సుబ్రహ్మణ్యం, శ్యామ్, అరుణ దంపతులు ప్రవచనకర్తను పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, దుశ్శాలువతో సత్కరించారు. వేద పాఠశాల విద్యార్థులు స్వస్తి పలికారు. ప్రవచనాలకు ముందు రత్నమాల బృందం అన్నమాచార్య కృతులతో ప్రేక్షక హృదయాలను శృతి చేశారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులతో ఈ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ భద్రం కమ్యూనిటీ హాలులో ఈ 15 రోజులూ బ్రహ్మశ్రీ మొక్కపాటి భాస్కర శర్మ పండితుల వారి సారధ్యంలో చతుర్వేద పారాయణ సహిత మహా నారాయణ యజ్ఞం జరుపతలపెట్టినట్టు నిర్వాహకుల తరపున కందాళ అరుణ గాయిత్రి ఒక ప్రటకనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ లక్ష్మీ నారాయణ పూజ, ఫిబ్రవరి 22న తులసీ కల్యాణం, 24వ తేదీన పుత్ర కామేష్టి యాగం, నవనీత పూజ, మార్చి ఒకటో తేదీన రుక్మిణీ కల్యాణం, భాగవత శ్లోక యజ్ఞం నిర్వహిస్తారు.
