Home Politics Andhra Pradesh అమరావతిని అంతర్జాతీయ క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం – మంత్రి కందుల దుర్గేష్

అమరావతిని అంతర్జాతీయ క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం – మంత్రి కందుల దుర్గేష్

0

ముంబాయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా 21వ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక పాలసీ 2024–29 మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశీయ, విదేశీ పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు.
మంత్రి మాట్లాడుతూ, అమరావతిని కేవలం రాజధానిగా కాకుండా అంతర్జాతీయ క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ వంటి గ్లోబల్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు.
అమరావతి–విశాఖపట్నం–తిరుపతి ప్రాంతాలను అనుసంధానిస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్, హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఆధారిత సాంస్కృతిక అనుభూతులు, అలాగే ‘ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ’ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లే వినూత్న ప్రణాళికలను పెట్టుబడిదారులకు వివరించారు.
మంత్రి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం, కంటెంట్, సంస్కృతి, జీవనశైలి మరియు ఇమ్మర్సివ్ డిజైన్‌ను పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేర్చే అంశంపై జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, ఆర్‌ఎంజెడ్, అర్వాస్, తమరా లీజర్ ఎక్స్పీరియన్సెస్, షాలెట్ హోటల్స్, హవాస్ మీడియా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది.
అదే విధంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో జరిగిన సమావేశంలో నెల రోజుల్లో ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక కథనాలు, ఇమ్మర్సివ్ టూరిజం అనుభవాల గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధించడం, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version