ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ హరీష్ బేతా
గుంటూరు నగరంలో అనాధ శవాలకు గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం, వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, లక్షలాది అనార్థులకు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 150 మంది మహిళలకు శిక్షణ అందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండగా నిలుస్తుందని బ్యాంకు జనరల్ మేనేజర్ హరీష్ బేతా పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో చేయూత ఫౌండేషన్ నిర్వహించిన 60 వేల విలువ చేసే వంట సామాగ్రి వితరణ కార్యక్రమానికి హరీష్ బేతా హాజరై ప్రసంగించారు. హరీష్ బేతా ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో అతి పేదలకు తోడ్పడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవా సంస్థలకు తోడ్పాటును అందిస్తామని తెలిపారు. ఇటీవలనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ పొందిన పోలూరి వీరారెడ్డి తన విశ్రాంత జీవితాన్ని సేవా కార్యక్రమాల వైపు మళ్ళించడం, 60 వేల రూపాయల విలువ చేసే వంట సామాగ్రిని తమ మిత్రుల సహకారంతో కోవిడ్ ఫైటర్స్ కు అందజేయడం అభినందనీయమన్నారు. చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నగరంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలన్నిటిని ఏకత్రాటిపైకి తెచ్చి వాటి అవసరాలను తీర్చడానికి దాతృత్వం గల సేవా తత్పరులతో అనుసంధానం చేసే ప్రక్రియను చేయూత ఫౌండేషన్ చేపడుతుందని తెలిపారు. విశ్రాంత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలూరి వీరారెడ్డి ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలుగజేస్తాయని, తమ బ్యాంకు లో పదవీ విరమణ చేసిన 3 వేల మందిని సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
