ఏ వెరీ సింపుల్ స్టోరీ రష్యాన్ నాటకం రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకిన్ అద్భుత సృజనగా దృశ్యరూపమే ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ నాటకం. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించింది. ‘రోమియో–జూలియట్’ తరహాలో సాగే ఇద్దరి ప్రేమికుల కథకు పెద్దల అడ్డంకులు ఎదురైన తరుణంలో ఆవు, గుర్రం, కుక్క, కోడి వంటి పెంపుడు జంతువులు మానవ లక్షణాలతో ప్రవేశించి కథను ఆసక్తికరంగా మలుపు తిప్పుతాయి. లోకజ్ఞానం లేని ఒక అమాయకపు పొరుగువాడు మనుషులకు, మూగజీవాలకు మధ్య సంధి కర్తగా మారి కథలో కీలక పాత్ర పోషించగా, జంతువులన్నీ ఏకమై ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడే ఘట్టం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది.
