Tuesday, April 21, 2026
HomeNewsతుస్సుమన్న పడవల పోటీలు

తుస్సుమన్న పడవల పోటీలు

– విశాఖ ఉత్సవ్ పడవల పోటీ ఏర్పాట్లపై గంటా అసహనం – అధికారుల తీరు సరి కాదన్న కలెక్టర్ హరేందిరా ప్రసాద్  విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లు మ.. మ.. అనిపించేలా మొక్కుబడి తంతుగా ఉన్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగమారిపేటలో గురువారం పడవల పోటీలను ప్రారంభించడానికి వచ్చిన ఆయన అక్కడ కనీస ఏర్పాట్లు లేకపోవడాన్ని చూసి అవాక్కయ్యారు. ఎలాంటి ప్రచారం లేకుండా.. జనం లేకుండా.. ఎవరి కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన విశాఖ ఉత్సవ్ నిర్వహణను ఇలా చేసి.. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ఫిషరీస్ జేడీ లక్ష్మణరావును నిలదీశారు. పడవలను ఏర్పాటు చేయాలని మాత్రమే తనకు చెప్పారని.. మిగిలిన ఏర్పాట్లు జిల్లా టూరిజం అధికారి మాధవి, స్పోర్ట్స్ అధికారి జూన్ గాలియట్ చేయాల్సి ఉందన్నట్టుగా లక్ష్మణరావు ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చారు. ఈ దశలో జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ కలుగజేసుకుని పడవల పోటీలకు నోడల్ అధికారిగా నియమించినందున మొత్తం బాధ్యత మీదేనని లక్ష్మణరావుకు స్పష్టం చేశారు. పడవల పోటీల గురించి ఎలాంటి ప్రచారం లేకపోవడంతో స్థానికులు సైతం ఎవరూ రాలేదు. అయితే ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటీల దగ్గరకు వచ్చారు. అనంతరం జెండా ఊపి పడవ పోటీలను గంటా ప్రారంభించారు. ఇందులో 15 మెకనైజ్డ్ పడవలు, 15 సంప్రదాయ పడవలు పోటీల్లో పాల్గొనగా.. విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, పోతిన అప్పలరాజు, కారి అప్పారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments